Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీతో చెలిమి తర్వాత బీహార్ అధికారపక్షం జేడీయూ చీలిక దిశగా కదులుతోంది. ఎన్నికల్లో కలిసి పోటీచేసిన మహాకూటమితో జేడీయూ తెగతెంపులు చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత జేడీయూ పార్టీని చీలిక దిశగా నడిపిస్తున్నారు. బీజేపీతో కుదుర్చుకున్న పొత్తును ఆమోదించుకునేందుకు నితీశ్ తన అధికారిక నివాసంలో జేడీయూ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కాకుండా శరద్ యాదవ్ మరో సమావేశం నిర్వహించారు. పార్టీ నుంచి సస్పెండ్ కు గురయిన రాజ్యసభ సభ్యుడు అలీ అన్వారీతో కలిసి జన ఆందోళన్ సమ్మేళన్ ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో చీలిక ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. త్యాగి… జేడీయూ ఎప్పటికీ విడిపోదని శరద్ యాదవ్ స్వచ్ఛందంగానే వెళ్లిపోతున్నారని చెప్పారు. త్యాగి మాటలను బట్టి చూస్తే శరద్ యాదవ్ కు ఇక జేడీయూ తో అనుబంధం ముగిసిపోయినట్టే కనిపిస్తోంది.
పార్టీలో ఆయనకు, ఆయన మద్దతుదారులకు వ్యతిరేకంగా నితీశ్ అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా ఉన్న శరద్ యాదవ్ ను ఆ పదవి నుంచి తొలగించి ఆర్సీపీ సింగ్ ను నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ శరద్ యాదవ్ వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. జేడీయూ మమాకూటమితో విడిపోవటాన్ని వ్యతిరేకిస్తున్న శరద్ యాదవ్ ఈ నెల 27న బీజేపీకి వ్యతిరేకంగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్వహించే ర్యాలీకి హాజరుకానన్నట్టు తెలుస్తోంది. ఈ ర్యాలీ తర్వాత తన రాజకీయ భవిష్యత్ పై శరద్ యాదవ్ నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన కొత్త పార్టీ పెడతారా లేక…మరేదైనా రాజకీయ పార్టీలో చేరతారా అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: