Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ కి ఇంకో సమస్య ఎదురైంది. నిన్నగాక మొన్న శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకి జలాల తరలింపు అంశంలో సాక్షి కధనం వల్ల వైసీపీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుందో చూసాం. ఇక ఇప్పుడు కూడా సాక్షి వల్లే ఇంకో ఇబ్బంది ఎదురు అయ్యింది. జగన్ సతీమణి, సాక్షి ఎండీ గా వ్యవహరిస్తున్న భారతీ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో చూద్దాం.
ఓ ఏడాది కిందట కృష్ణా జిల్లాలో కాల్ మనీ వ్యవహారం సంచలనం అయ్యింది. అధిక వడ్డీలు గుంజుతూ కూడా అప్పు తీసుకున్న వారిని రాచి రంపాన పెడుతున్న విషయాలు వెలుగుజూశాయి. ఈ కేసులో ఎందరో నాయకుల పేర్లు కూడా ముందుకు వచ్చాయి. ఆ టైం లో కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు మీద కొన్ని కధనాలు సాక్షిలో వచ్చాయి. అయితే ఆ రాసిన కథనాల్లో నిజం లేదని , ఆ కధనాలు తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించాయని చలసాని సాక్షి మీద నూజివీడు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టుకి హాజరు కాకపోవడంతో సాక్షి దిన పత్రిక ఎండీ భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.