నందమూరి హరికృష్ణ మరణించడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు ప్రజలు విషాదంలో మినిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన అభిమానులు అయితే పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోన కుమిలిపోతున్నారు. ఏదో తెలియని భావోద్వేగం తెలుగు రాష్ట్రాల ప్రజలను విచారంలోకి నెట్టేసింది. తాజాగా హరికృష్ణ గౌరవార్ధం ప్రముఖ టీవీ ఛానెల్ ఎన్టీవీ తమ వార్షికోత్సవ వేడుకలు సైతం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది ఆగస్ట్ 30న ఎన్టీవీ 11వ ఏడాదిలోకి అడుగు పెడుతుంది. దీంతో ఈరోజు భారీ ఎత్తున వేడుకలు చేయాలని నిర్ణయించుకున్నారు సంస్థ అధినేత నరేంద్ర చౌదరి. దానికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ముందే పూర్తయ్యాయి. కానీ అనుకోని విధంగా హరికృష్ణ మరణంతో ఆయనతో తమకున్న అనుభందం దృష్ట్యా ఈ ఏడాది ఎటువంటి వేడుకలు ఉండవని ప్రకటన విడుదల చేసింది ఎన్టీవీ సంస్థ. దీంతో సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులతో పాటు బయట నందమూరి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేసారు.