ఓ బేబీ గొప్ప బహుమతి

oh baby great gift

ఈ సినిమాకు పనిచేసిన రోజుల కంటే ఈ చిత్ర ప్రచారానికే ఎక్కువ రోజులు కేటాయించాను. ఏ టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ చూసినా నీ ముఖమే కనిపిస్తోందని అన్నారు. అది విని నాకే సిగ్గుగా అనిపించింది అన్నారు సమంత. ఆమె నటించిన తాజా చిత్రం ఓ బేబీ. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌మీట్‌ని ఏర్పాటు చేసింది. సమంత మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజు రాత్రంతా నిద్రపోకుండా గడిపాను. సోషల్ మీడియాలో సినిమాపై పాజిటివ్ ట్వీట్‌లు చూసి ఈ సినిమాకు నా పని అయిపోయింది. ఇక వీళ్లు చూసుకుంటారని రిలాక్స్ అయ్యాను. మీడియా, విమర్శకుల నుంచి తొలి స్పందన లభించింది.

దీంతో ప్రేక్షకుల్లోకి సినిమా చాలా సులువుగా వెళ్లిపోయింది. ఈ సక్సెస్ నాకు లభించిన గ్రేట్ గిఫ్ట్‌గా భావిస్తున్నాను. ఈ సినిమా తరువాత ఏం చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి? అనే కన్ఫ్యూజన్‌లోనే వున్నాను. రెండు రోజులు ఇదే ఆలోచనల్లో ఉంటాను. ఆ తరువాత కొత్త తరహా సినిమా చేయాలి. మరింత బాగా నటించాలి అని ఆలోచిస్తాను. అలా ఆలోచించడం కొంచెం పిచ్చే. బేబీ పాత్రలో నన్ను ఆదరించి నాకు ఈ సక్సెస్ రూపంలో మంచి బహుమతి ఇచ్చారు అని తెలిపింది. రానా మాట్లాడుతూ ఓ బేబీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. ఈ సినిమా కలెక్షన్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లని అడిగితే మీ సినిమా కన్నా బాగా ఆడుతోంది అన్నారు. ఏడాదికి నేను మూడు చిత్రాల్లో నటించాలన్నది మా నాన్న కోరిక. అంత టాలెంట్ అయితే నాకు లేదు. నాకు ఒక సినిమానే మూడేళ్లు పట్టేస్తుంది.

సమంత పిచ్చికి అడ్రస్ దొరికింది. తను ఎన్ని సినిమాలు చేయాలనుకుంటే అన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో చేసుకోవచ్చు. సమంత, నందిని, సునీత ఈ ముగ్గురూ సరైన గొడుగు లాంటి సురేష్ ప్రొడక్షన్స్‌లోకి వచ్చేసి నేను ఆనందించేలా చేశారు. ముగ్గరు మహిళలు కలిసి హృదయాలకి హత్తుకునే చిత్రాన్ని రూపొందించారు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని, ఓ కొరియన్ కథని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇలాంటి కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దిన నందిని రెడ్డికి హ్యాట్సాఫ్ అన్నారు. నందినిరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు. మా అమ్మ, అమ్మమ్మ గుర్తొచ్చిందని నన్ను కౌగిలించుకుని ఏడ్చారు. నా జన్మ ధన్యమైంది అనిపించింది అన్నారు. ఈ కార్యక్రమంలో తేజ, సునయన, సునీత తాటి, వివేక్ కూచిభోట్ల తదితరులు పాల్గొన్నారు.