నిన్న 17వ లోక్‌సభ సోమవారం కొలువుదీరిన నేపధ్యంలో కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులతో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎంపీలు కుటుంబసభ్యులు, వారి పార్టీల నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రమాణస్వీకార్ని తిలకించేందుకు వచ్చిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు సాగించారు. ఈ సన్నివేశం అందర్నీ ఆకర్షించింది. తొలుత గ్యాలరీలో ముందువరుసలో సీఎం రమేశ్ కూర్చొని ఉండగా, ఆయన వెనుక వరుసలో విజయసాయి రెడ్డి కూర్చున్నారు. ముందు ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకుని పరస్పరం కరచాలనం చేసుకొని కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే ఉన్నారు. తర్వాత విజయసాయిరెడ్డి వచ్చి సీఎం రమేశ్ పక్కన కూర్చొన్నారు. ఈ ఇద్దరూ దాదాపు గంటన్నరకుపైగా మాట్లాడుకోవడం అది కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుకోవడం విశేషం. కాసేపటి తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చినా ఆయన మాత్రం వారికి దూరంగా కూర్చుండిపోయారు. అనంతరం సీఎం రమేశ్, విజయసాయిరెడ్డిలు చర్చల్లో మునిగిపోయారు. దీనిని గమనించిన మీడియా వారిద్దరి చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. దీనికి మీ హయాంలో ఏమేం చేశారో చెప్పమని రమేశ్‌ను అడిగానని ఆయన బదులిచ్చారు. అయితే, ఉప్పు నిప్పులా ఉండే విజయసాయి, సీఎం రమేశ్ అంత అప్యాయంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.