ప్రతిపక్ష నేత ఆయనేనా ?

Opposition Leader In Telangana

తెలంగాణలో రాజకీయాలు మందకొండిగా సాగుతున్నాయి. ఎన్నికల వరకూ ఎంతో ఆసక్తికరంగా సాగిన తెలంగాణా రాజకీయం ఇప్పుడు అంతగా రుచించట్లేదు. ఒకపక్క మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయకుండా కేసీఆర్ తాత్సారం చేస్తుంటే మరో పక్క ప్రతిపక్ష నేత ఎవరు అనే దానిపై ఇంకా సందిగ్దత వీడలేదు. ఎన్నికల ఫలితాల వచ్చాక ఇప్పటి వరకు సీఎల్పీ భేటీ జరగలేదు. ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతున్న నేపథ్యంలో తెలంగాణ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాల్‌ లో సమావేశమయ్యారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌ లో ఓ హోటల్‌ లో కాంగ్రెస్‌ నేతలు సమావేశమై చర్చించినా సీఎల్పీనేత ఎంపికపై ఓ నిర్ణయానికి రాలేదు.

దీంతో ఏఐసీసీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్‌ ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సీఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సీఎల్పీ నేత కోసం ఎమ్మెల్యేల అభిప్రాయాలను వేణుగోపాల్ స్వీకరిస్తున్నారు. మెజారిటీ నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు సీఎల్పీ నేత ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్‌ కు ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎల్పీ నేత రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే సీఎల్పీ నేతగా మల్లుభట్టివిక్రమార్కను ఎన్నుకునే అవకాశం ఎక్కువ ఉన్నట్లు చెబుతున్నారు.