Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం, చీలికవర్గం పన్నీర్ స్వామి ఒక్కతాటిపైకి వచ్చేందుకు కీలక అడుగుపడింది. విలీనానికి పన్నీర్ సెల్వం విధించిన డిమాండ్లను ఒప్పుకున్న పళనిస్వామి ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. .జయలలిత మృతిపై విచారణ కమిటీ ఏర్పాటుచేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో విచారణ కమిషన్ నియమించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీంతో పాటు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని ప్రభుత్వ స్మారక కేంద్రంగా మారుస్తామని హామీఇచ్చారు. చీలికవర్గం విలీనానికి పన్నీర్ సెల్వం ఈ షరతులు విధించారు. దీంతో పాటు దినకరన్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని కూడా షరతు విధించారు. ఈ డిమాండ్ ను ఇప్పటికే నెరవేర్చిన పళనిస్వామి ఇప్పుడు మిగిలిన రెండు షరతులకు కూడా ఒప్పుకుని వాటిని అమలు చేశారు. ఇక రెండు వర్గాలు ఒకేగూటి కిందకు రావటమే తరువాతి పరిణామం.
ముఖ్యమంత్రి తాజా నిర్ణయాలతో అన్నాడీఎంకెలో శశికళ వర్గానికి ఇక చెక్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు. జయ మరణం తరువాత బలహీనపడిన అధికార పక్షం రెండు వర్గాల విలీనంతో రాష్ట్రంలో మళ్లీ బలపడాలని భావిస్తోంది. అయితే ఒకప్పుడు అన్నాడీఎంకెను అంతా తామై నడింపించిన శశికళ వర్గం …పార్టీకి దూరం జరగటానికి సిద్ధంగా లేదు. పార్టీపై పట్టు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. టీటీవీ దినకరన్ మధురైలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బలాన్ని చాటేందుకు ప్రయత్నించారు. ఈ ర్యాలీకి జనం భారీగానే తరలివచ్చారు. దీనిపై అన్నాడీఎంకె చీలికవర్గం నేత పాండ్యరాజన్ మాట్లాడుతూ ఏదో ఒక సమావేశం చూసి తాము ఎలాంటి ప్రకటనా చేయబోమని, అలాంటి 18 సమావేశాలు తాము ఏర్పాటుచేసినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని బదులిచ్చారు. మొత్తానికి హామీఇచ్చినట్టుగానే పన్నీర్ స్వామి విధించిన షరతులకు తలొగ్గి మరీ ఆయన్ను కలుపుకుపోయేందుకు పళనిస్వామి ముందుకొచ్చారు.
మరిన్ని వార్తలు:
కమల్ రాజకీయ పయనమెటు?