2019 ఎన్నికల్లో జనసేన ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో ఇప్పటిదాకా కచ్చితంగా అంచనా వేసే పరిస్థితులు లేవు. ప్రత్యర్థి పార్టీలు పవన్ కి అంత సీన్ లేదు అంటున్నాయి. ఓ వైపు జనాలు తండోపతండాలుగా రావడం చూసి పవన్ ఫ్యాన్స్ లో తమ నాయకుడు సీఎం అవుతాడు అంటున్నారు. అయితే ప్రజారాజ్యం అనుభవంతో వారిలోకూడా ఎక్కడో అనుమానం. ఈ జనం ఫాలోయింగ్ పోలింగ్ దాకా వస్తుందా అన్న అనుమానం. అయితే ఓ వారం పది రోజులుగా పవన్ ఫ్యాన్స్ లో తన అధినేత సీఎం అవ్వడం ఖాయం అన్న నమ్మకం పెరిగిందట.
దీనికి కారణం తెలిస్తే మాత్రం ఆశ్చర్యంగా వుంది . పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ గెలుపు , పక్కనున్న తమిళనాడులో కరుణ మరణం తో వెల్లువెత్తిన సానుభూతి చూసి పవన్ ఫ్యాన్స్ కి కొత్త సెంటిమెంట్ పుట్టుకొచ్చిందట. అటు ఇమ్రాన్, ఇటు కరుణ మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారే. ప్రస్తుతం ప్రజలు అలాంటి విషయాల గురించి పట్టించుకోకపోబట్టే ఇమ్రాన్ విజయం సాధించారని , కరుణ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేయగలిగారు అని వాళ్ళు అనుకుంటున్నారట. ఆ ఫ్లో చూసి పవన్ కూడా సీఎం అవుతాడని గట్టిగా నమ్ముతున్నారంట.
పవన్ ఫాన్స్ కి మూడ్ రావడానికి కారణం వింటే మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టుంది. అయితే నమ్మకాలు , విశ్వాసాలకు లాజిక్ తో పని ఉండదని ఇప్పుడేమీ ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు రుజువైంది . ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ని తప్పుపట్టడానికి ఏముంది? ఒకవేళ జనసేన ఏపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే ఆ సెంటిమెంట్ బలపడిపోతుంది. ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ వ్యక్తి ఆరాధన రాజకీయాల్లో కొనసాగినంత కాలం ఇంతే .ప్రజలు ఆ బలహీనత దాటి విధానాల పరంగా పాలకుల్ని ఎన్నుకునే రోజులు వచ్చేదాకా ఇలాంటి నమ్మకాలు , చిత్రవిచిత్రాలు చూడకతప్పదు.