Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగురాష్ట్రాల్లో దుమారం రేపుతున్న దాచేపల్లి దారుణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. కథువా నుంచి కన్యాకుమారి దాకా జరుగుతున్న అత్యాచార ఘటనల గురించి విన్నప్పుడల్లా తనతో పాటు సమాజమంతా తీవ్ర వేదనకు గురవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. దాచేపల్లి సంఘటన కూడా మనసు కలిచివేసిందని, నిస్సహాయతకు గురిచేసిందని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితిలో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన బిడ్డకు, కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానన్నారు.
అసలు ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్ గా శిక్షించే విధానాలు రావాలని తాను కోరుకుంటున్నట్టు పవన్ ట్వీట్ చేశారు. ఈ దారుణంపై ప్రభుత్వంపై సీరియస్ గా స్పందించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుడికి పట్టిచ్చిన వారికి నగదు బహుమతి ప్రకటించారు.