చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ఇటీవలే పూర్తి అయ్యింది. ఇక గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నాడు. తన అభిమాన సంఘంను మరియు తనకు సన్నిహితంగా ఉండే వారిని తమ్ముడు పార్టీ జనసేనలో జాయిన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ సమయంలోనే చిరంజీవి 2019 ఎన్నికల సమయానికి జనసేనలో జాయిన్ అయ్యి, పోటీ కూడా చేసే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తాజాగా చిరంజీవి రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. తన అన్న జనసేనలోకి వచ్చే అవకాశం లేదని పవన్ ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
గత కొన్ని నెలలుగా ఏపీలో విపరీతంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా సిద్దం అవుతున్నాడు. ఈ సమయంలోనే జాతీయ మీడియా సంస్థ ఈయనతో ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్థావన వచ్చిన సమయంలో తన అన్నయ్య చిరంజీవి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తున్నాడు, ఆయన ఇకపై మొత్తం సినిమాలకే మొగ్గు చూపుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. తన జీవితాన్ని సినిమాలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా పవన్ పేర్కొన్నాడు. చిరంజీవి ఇక రాజకీయాల్లోకి రాడు అంటూ పవన్ ప్రకటన నేపథ్యంలో ఆయన మద్దతు మాత్రం జనసేనకు ఉంటుందని పవన్ చెప్పకనే చెప్పాడు. మెగా ఫ్యాన్స్ మరియు మెగా ఫ్యామిలీ అంతా కూడా జనసేనకు మద్దతుగా నిలుస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.