Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాలుగో రోజు కూడా లోక్ సభ వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అన్నాడీఎంకే, తెరాస ఎంపీలు వెల్ లోకి రావడాన్ని సాకుగా చూపి సభని వాయిదా వేసుకుంటూ వెళుతోంది బీజేపీ. ఈ విషయాన్ని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని అడిగినట్టు కోల్ కతా కి చెందిన వార్తాపత్రికలు చెబుతున్నాయి. ఇక ఈ అవిశ్వాసానికి ఆద్యుడు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విభజన హామీలు నెరవేర్చని కేంద్రం మీద దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని టీడీపీ, వైసీపీ లకు సవాల్ విసిరింది పవనే. పైగా వాళ్ళు అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానని హామీ కూడా ఇచ్చారు.
పవన్ సవాల్ కి దీటుగా స్పందించిన టీడీపీ, వైసీపీ ఇప్పుడు లోక్ సభలో అవిశ్వాసం పెట్టాయి. అయితే ఢిల్లీ వెళ్లి వివిధ పార్టీల మద్దతు కూడగడతానని చెప్పుకున్న పవన్ మాత్రం జాతీయ చానెల్స్ కి ఇంటర్వూస్ తో సరిపెడుతున్నారు. ఏ ఒక్క పార్టీ ని కలిసి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని ఆయన కోరలేదు. చివరకు రాష్ట్ర స్థాయిలో ఆయన వెంట నడుస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులకు కూడా ఆ విజ్ఞాపన చేయలేదు. ఇక మూడు రోజుల కిందట ఆయన ఓ జాతీయ ఛానల్ తో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ పాలనకు సంబంధించి పవన్ పంతులు గారిలా మార్కులు వేశారు. తెలంగాణ సీఎం కెసిఆర్ కి 6, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 2.5 మార్కులు ఇచ్చారు. అంతగా కెసిఆర్ ని ప్రసన్నం చేసుకున్న పవన్ కి ఇప్పుడు లోక్ సభలో అవిశ్వాసం చర్చకు రాకుండా వెల్ లోకి తెరాస వస్తోందని తెలియదా ?. 6 మార్కులు వేసినందుకైనా ఓ అర్ధగంట మౌనం పాటిస్తే మా అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని కెసిఆర్ కి పవన్ విన్నపం చేయలేకపోయారా ? కావాల్సిన పని మీద చిత్తశుద్ధి లేకుండా కేవలం విమర్శలకే పరిమితం అయితే పవన్ రాజకీయానికి భూతకాలం ఉంటుందేమో గానీ భవిష్యత్ ఉండదు.