Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ… విభజన హామీలు, అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకున్న వివాదాల్లో నిజాలు నిగ్గు తేల్చడానికి ఏర్పడిన కమిటీ. ఆ కమిటీ స్వయంగా గణాంకాల సేకరణకు ఏర్పాటు చేసిన ఇంకో త్రిసభ్య కమిటీ, ఈ త్రిసభ్య కమిటీలో అంతా మాజీ ఐఏఎస్ లే. ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్న కంటిపూడి పద్మనాభయ్య కేంద్ర హోం శాఖ లో కార్యదర్శి గా పని చేయడమే కాదు వివిధ రంగాల్లో ఆయన చేసిన అపార సేవలకు గాను పద్మభూషణ్ కూడా అందుకున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరు ఐవైఆర్ కృష్ణారావు. ఈమధ్య దాకా ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా పని చేసి రిటైర్మెంట్ తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయ్యారు. అయితే పదవులు ఇచ్చిన ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతూ ఆ పదవులు పోగొట్టుకుని చంద్రబాబు సర్కార్ మీద ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురు చూస్తున్నారు. ఇంకొకరు తోట చంద్రశేఖర్. రాజకీయాల మీద అనురక్తితో ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. 2009 లో పీఆర్ఫీ , 2014 లో వైసీపీ నుంచి ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఈ కమిటీ లో సభ్యులని చూసినప్పుడు ఇద్దరి వైఖరి టీడీపీ కి వ్యతిరేకం. ఇక పద్మనాభయ్య న్యూట్రల్.
ఈ కమిటీ ని చూసినప్పుడు సహజంగా ఇది ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షానికి వ్యతిరేకం అనిపించే అవకాశాలు ఎక్కువ. కానీ అక్కడే ఎవరైనా పప్పులో కాలేస్తారు. కానీ నిజానికి ఈ కమిటీ తో జగన్ రెక్కలు విరిచాడు పవన్. వైసీపీ ఇప్పటికే మేధోవలస సమస్యతో అల్లాడిపోతోంది. పార్టీలో లేకపోయినా ఉండవల్లి, ఐవైఆర్ లాంటి వాళ్ళు జగన్ మేలు కోరేవాళ్ళు. ఆయనకు లబ్ది చేకూర్చే సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు. కానీ ఆ ఇద్దరినీ నిజనిర్ధారణ కమిటీ లోకి తీసుకురావడం ద్వారా పెద్ద షాక్ ఇచ్చాడు పవన్ . ఇక తోట చంద్రశేఖర్ ఈ భేటీలో పాల్గోవడం జగన్ కి అంత కన్నా పెద్ద షాక్. ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి అనుకున్న వ్యక్తి హఠాత్తుగా ఇలాంటి భేటీకి వెళ్లడం , అది కూడా సొంత పార్టీ కాదు అనుకున్న మీటింగ్ కి వెళ్లడం చిన్న విషయం కాదు. ఈ పరిస్థితుల్లో చంద్రశేఖర్ మీద క్రమశిక్షణా చర్య తీసుకుంటే అది ఎక్కడి దాకా వెళుతుందో తెలియని పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రత్యేక హోదా , ఇతర విభజన సమస్యల నేపథ్యంలో బీజేపీ కి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ కి పవన్ ఏర్పాటు చేసిన కమిటీ తలనొప్పిగా మారింది. విపక్షవ్యూహానికి ఈ కమిటీ పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇలా అన్ని రకాలుగా జగన్ రెక్కలు విరిచాడు పవన్.