Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన పార్టీని చాప కింద నీరులా విస్తరించాలని అనుకుంటున్నారు పవన్. కానీ ఇంతలోనే నంద్యాల ఉపఎన్నిక వచ్చేసింది. జనసేనకు ఇంకా అభ్యర్థిని నిలిపే గ్రిప్ రాలేదు. మరి ఎవరికి మద్దతివ్వాలనే ప్రశ్న తెరపైకి వచ్చింది. మిత్రపక్షం కాబట్టి టీడీపీకే జై కొట్టాలి. కానీ అందుకు పవన్ తటపటాయిస్తున్నారు. వచ్చే ఎన్నికలపై కొన్ని లెక్కలు వేసుకున్న పవన్ అందుకు అనుగుణంగా తటస్థంగా ఉండే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు.
కానీ పవన్ తటస్థ వైఖరి కుదరదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఉద్దానం సమస్యపై అమరావతిలో బాబును కలిసి పవన్.. తాను టీడీపీకి రహస్య స్నేహితుడిని కాదన్నారు. అంటే మైత్రికి ఢోకా లేదని చెప్పినట్లే. అలాంటప్పుడు భూమా బ్రహ్మానందరెడ్డికి ఎందుకు మద్దతివ్వడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. పవన్ స్వభావ రీత్యా జగన్ తో పొత్తుకు అవకాశం లేదు. కాబట్టి లేటైనా టీడీపీతోనే జట్టుకట్టాలి.
ఇంకా పద్నాలుగు రోజులు సమయం ఉంది కాబట్టి.. పవన్ లేటుగా ఎంట్రీ ఇచ్చినా ఆ పంచ్ వేరుగా ఉంటుందనేది టీడీపీ భావన. ఇప్పటికే చంద్రబాబు పవన్ కు కొన్ని సూచనలు చేశారని తెలుస్తోంది. మరి నిజంగా బాబు చెప్పినట్లు పవన్ వింటారా.. లేదంటే పవర్ స్టార్ మనుసులో వేరే ఆలోచనలు ఉన్నాయా అనేది ఉపఎన్నికల నాటికి తేలుతుంది. కానీ ప్రస్తుతం నంద్యాలలో టీడీపీ గాలి వీస్తోంది. పవన్ వచ్చినా, రాకపోయినా బ్రహ్మానందరెడ్డికి ఢోకా లేదనేలా పరిణామాలున్నాయి.