Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలే అంత… ఇక్కడ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండరు. ఏ క్షణాన మిత్రపక్షాలు, శత్రువులుగా మారతాయో, ఎప్పుడు శత్రువులు మిత్రులవుతారో ఎవరూ ఊహించలేరు. కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులు సైతం రాజకీయ స్థితిగతులను అంచనా వేయలేరు. ఈ విషయం తెలిసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కృతమయ్యే సంగతులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేయక మానవు. గుంటూరులో జనసేనాని సభ తర్వాత ప్రజలందరూ ఇలానే ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు. నాలుగేళ్లగా అధికార టీడీపీకి నమ్మకమైన మిత్రుడుగా ఉన్న జనసేనాని… ఇలా ఎందుకు అకస్మాత్తుగా తన విధానం మార్చుకున్నారు. దీని వెనక ఎవరున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఇలా కొత్త రంగు వేసుకున్నారు? తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా నడుస్తోన్న చర్చలివే. పవన్ ఎన్ని విమర్శలు, ఎన్ని రకాల కొత్త ఆరోపణలు చేసినప్పటికీ… అంతిమంగా ఆయన పరోక్షంగా తేల్చిచెప్పింది ఒక్కటే. 2019 ఎన్నికల్లో తాను అధికార టీడీపీ వ్యతిరేక కూటమిలో చేరి బీజేపీ, వైసీపీతో కలిసి నడుస్తానన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం.
తప్పులేదు… ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడైనా తన అభిప్రాయాలు మార్చుకునే వీలుంది. కానీ ఆయన అభిప్రాయానికి జనాల మద్దతు లభించే రాజకీయ పరిస్థితులు కూడా ఉండాలి. విభజన బాధిత రాష్ట్రంగా… కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందక దిక్కుతోచక అలమటిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో సినిమా నేపథ్యం మాత్రమే ఉన్న ఓ హీరో, ఎన్నికల సాక్షిగా ఇచ్చిన హామీలు అమలుచేయకుండా… ప్రజల్ని నిట్టనిలువునా మోసం చేసిన బీజేపీ, రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి సొంత రాజకీయలెక్కల్లో మునిగితేలుతున్న వైసీపీ తో కలిసి ఏమన్నా అద్భుతాలు సృష్టించే పరిస్థితులు ఉన్నాయా…? అంటే లేవనే సమాధనమే వస్తుంది. పార్టీలకతీతంగా ప్రజలంతా ఏపీకి అన్యాయం జరిగిందని నమ్ముతున్నారు. అయితే వారంతా టీడీపీ వెంటే నడవకపోవచ్చు. కుల, ప్రాంత నేపథ్యాలు ఓటుబ్యాంక్ ను ప్రభావితం చేసే రాష్ట్రంలో ఇష్టానుసారం తమకు నచ్చిన పార్టీలకు ఓటు వేయొచ్చు. అయితే కేంద్రం మీద రాష్ట్ర ప్రజల్లో కలుగుతున్న కసి, బాధ, సొంతరాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం వంటి అంశాలు… ప్రజలు సొంత ఇష్టాలను పక్కనపెట్టే పరిస్థితిని కల్పించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగింది ఇదే.
నిజానికి అప్పుడు అధికారంలోఉన్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంలో ఉన్న అసలు లక్ష్యం రెండు రాష్ట్రాల్లో తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని దెబ్బతీయడమే. నేతల అంచనాలన్నీ ఆ తీరులోనే సాగాయి. విభజనకు ముందు పరిస్థితి కూడా అలాగే కనిపించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందన్న భావన కలిగింది. కానీ ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా విభజన అమలు చేసిందో… రాత్రికి రాత్రే ప్రజల ఉద్దేశాలు మారిపోయాయి. ఒకప్పుడు హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేయడం చంద్రబాబు ఓటమికి దారితీయగా… విభజనసమయంలో మాత్రం ఆ అంశమే ఆయనకు లాభించింది. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నేత అయితేనే అనాథగా మారిన రాష్ట్రాన్ని గాడిన పెట్టగలరని, హైదరాబాద్ లాంటి రాజధాన్ని నవ్యాంధ్రలో నిర్మింగలరని ప్రజలు నమ్మారు. ఎన్నికల్లో టీడీపీకి పట్టంగట్టారు. అంతేతప్ప బీజేపీతోనో, జనసేన మద్దతుతోనో వచ్చిన గెలుపుకాదిది. బీజేపీ, జనసేనతో పొత్తు నిర్ణయం జరగకముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించడమే ఇందుకు నిదర్శనం. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ గెలుపు ఘనతను మొత్తం బీజేపీ, జనసేనకు తగిలించి ఆత్మసంతృప్తి పొందారు.
ఇలాంటి అర్థంపర్ధంలేని విశ్లేషణలు చూసుకుని జనసేనాని… తన వల్లే టీడీపీ ప్రభుత్వం మనగలుగుతోందనే అపోహలో కాలం వెళ్లదీశారు. పవన్ తనను తాను ఎంత ఎక్కువగా ఊహించుకుంటున్నారో తెలుసుకోడానికి ఆయన ప్రసంగంలోని ఒక వాక్యమే ఉదాహరణ. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీకి మద్దతిస్తానో లేదో తెలియక ఏపీలో వైసీపీని ఎదుర్కోడానికి ప్రతి నియోజకవర్గానికి పాతిక కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలని చూస్తున్నారన్నది పవన్ ఆరోపణ. అంటే ఆయనమాటల అర్ధం తన మద్దతు ఉంటే మాత్రమే టీడీపీ గెలవగలదని. ఇలా తన అసలు బలాబలాలేమిటో అంచనావేసుకోకుండానే నేలవిడిచి స్వర్గంలో విహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారి 2009 నాటి రాజకీయపరిస్థితులు గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. పవన్ కంటే విస్తృతసంఖ్యలో అభిమానుల మద్దతు ఉన్న చిరంజీవి… రాజకీయాల్లో ఎలాంటి దయనీయ పరిస్థితి ఎదుర్కొన్నారో పవన్ మర్చిపోకుండా ఉంటే… అన్నయ్యకు కలిగిన పరాభవం నుంచి తాను తప్పించుకునే వీలుంటుంది. సభలకు భారీగా తరలివచ్చే అభిమానులు, ఒక్క వాక్యం మాట్లాడితే విశేషమైన కవరేజ్ ఇచ్చే మీడియా, అసలు నిజం చెప్పకుండా పొగడ్తల్లో ముంచెత్తే వందిమాగధులను చూసుకుని పవన్ రెచ్చిపోతే… ఉమ్మడిఆంధ్రప్రదేశ్ లో చిరంజీవికి ఎదురయిన చేదు అనుభవాన్ని మించిన గుణపాఠం నవ్యాంధ్ర ప్రజలు నేర్పిస్తారు.