Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీకాకుళం జిల్లా వాసులు పొట్ట చేత పట్టుకుని కూలి పనులు చేసుకోవడానికి వలసలు వెళ్తున్న దుస్థితికి ప్రభుత్వాలే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అవమానాలు సీఎం చంద్రబాబుకో, గతంలో పాలించిన కాంగ్రెస్ నేతలకో జరగవని, వలసలు వెళ్లేవారికి జరుగుతున్నాయని అన్నారు. గతంలో తన వద్దకు వచ్చి చాలా మంది తమ ఇబ్బందులు చెప్పుకునేవారని, సొంత ప్రాంతాన్ని వదిలి వచ్చినందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని అనేవారని తెలిపారు. చంద్రబాబులాంటి నేతలు అనుసరిస్తున్న పాలసీల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు.
రాజకీయ జవాబుదారీతనం లేకుండా పోతోందని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి నిర్లక్ష్యానికి గురయిన ప్రాంతాల అభివృద్ధి గురించి సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అప్పట్లో హైదరాబాద్ లో చేసిన తప్పే అమరావతిలోనూ చేస్తున్నారని, పెట్టుబడులన్నీ ఒక్కచోటే పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ మరోసారి ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉద్ధాంలో మేం చేయాల్సినవి అన్నీ చేశామని సీఎం అంటున్నారని, కానీ సరైన చర్యలను ప్రభుత్వం తీసుకోవడం లేదని పవన్ మండిపడ్డారు. ఇసుక మాఫియా మీద ఉండే ఆసక్తి… ఉద్ధానం కిడ్నీ సమస్యలపై ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు.
లోకేశ్ పై కూడా జనసేనాని విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా గురించి రెండేళ్ల క్రితం మాట్లాడితే… అప్పుడు చంద్రబాబు అది సంజీవని కాదన్నారని గుర్తుచేశారు. ఇప్పుడేమో మాటమార్చుతున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరు మీద పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని, జన్మభూమి కమిటీలను కచ్చితంగా రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జనసేన సైనికులను వాడుకుని అధికారంలోకి వచ్చారని, సాయం చేసిన చేతులను నరికివేసే తత్వం టీడీపీదని ఆరోపించారు. కేంద్రప్రభుత్వంపైనా పవన్ విమర్శలు చేశారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని గుజరాత్ లో పెట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. అణు విద్యుత్ కేంద్రాలకు శ్రీకాకుళం కావాలి గానీ, అభివృద్ధికి, ఉద్యోగాలకు వద్దా అని ప్రశ్నించారు.