Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్షణానికో రంగు మార్చే రాజకీయాల్లో ఓ మాట మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి . ఇక ఎన్నికల ఏడాది ప్రకటనల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. పొత్తులు వంటి కీలక విషయాలు మాట్లాడాలంటే అంతకన్నా ఒద్దికగా అడుగులు వేయాలి. ఈ వైనం మరిచి జాతీయ మీడియా తో వైసీపీ అధినేత జగన్ మాట్లాడిన మాటలతో ఏకంగా బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. ఏ విషయంలోనో తెలుసా …జగన్ తల అంటడంలో.ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అన్నది కాలం చెల్లిన వ్యవహారంగా కేంద్రం లోని బీజేపీ తేల్చి చెప్పిన విషయం ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు. కానీ ఏపీ సీఎం కుర్చీలో కూర్చోవాలని కలలు కంటున్న జగన్ కి మాత్రం ఈ విషయం తెలియనే తెలియనట్టు మాట్లాడారు పాపం.
బీజేపీ గనుక ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధం అట. జగన్ ఈ మాట అనగానే బీజేపీ హోదా ఇదిగో అంటూ పరిగెత్తుకు వస్తుంది అనుకుంటే ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి ఇంకెక్కడ హోదా అని తేల్చిపారేశారు. ముగిసిపోయిన విషయం గురించి మాట్లాడ్డం విడ్డూరం అని ఆమె విమర్శించారు. హోదా వల్ల కలిగే ప్రయోజనాలు మొత్తం కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి అందిస్తోందని ఆమె వివరించారు. జగన్ పొత్తు కోసం పాకులాడిన బీజేపీ ఆ రకంగా కౌంటర్ ఇస్తే కాంగ్రెస్ ఇంకో రేంజ్ లో విరుచుకుపడింది.
హోదాకు పాతర వేసిన బీజేపీ తో పొత్తుకు పాకులాడడం అంటే కేసుల కోసమే అని కాంగ్రెస్ నేత J.D. శీలం విరుచుకుపడ్డారు. రాహుల్ ప్రధాని అయితే ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబుతుంటే స్పెషల్ స్టేటస్ లేదని చెబుతున్న బీజేపీ వెంట ఎందుకు పడుతున్నావని జగన్ ని నిలదీశారు. ఈ ప్రశ్నకు పాపం జగన్ దగ్గర సమాధానం ఎక్కడుంది ? ఏదేమైనా ఒకే కామెంట్ తో ఇటు బీజేపీ , అటు కాంగ్రెస్ తో తలంటించుకున్న ఘనత జగన్ దే. ఆ రెండు పార్టీలు మిగిలిన అన్ని చోట్ల ఉప్పునిప్పులా వున్నా జగన్ తలంటే విషయంలో మాత్రం ఒక్కటి అయ్యాయి.