Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యువత ప్రాథమిక హక్కుల కోసం పోరాడాలని, ఫలితాలు ఎలా ఉన్నా సరే పోరాటం ఆపకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. దేశంలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు అందడం లేదని, గాలి, నీరులాంటి ప్రాథమిక హక్కుల కోసం కూడా నేటితరం ప్రజలు పోరాడాలని పవన్ కోరారు.
దేశ రాజధాని నుంచే స్వచ్ఛమైన గాలి దొరకడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొందని, పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ వల్ల స్థానికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పవన్ వెల్లడించారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు పొందే హక్కు కూడా తమకు లేదా అని అక్కడి యువకులు తనను ప్రశ్నించినట్టు పవన్ తెలిపారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ వేదికల్లో భారత్ ప్రకాశిస్తోందని, అదే సమయంలో రాజకీయ అవినీతి, స్పందించని నేతల స్వభావం ఎక్కువైందని విశ్లేషించారు. ఫలితాలు ఎలా ఉన్నా పోరాటం ఆపకూడదన్నదే..మనదేశంలో కాలుష్యంతో విసిగిపోయిన లక్షలాదిమంది ప్రజల అభిప్రాయమని..జైహింద్ అని పవన్ తన ట్వీట్లు ముగించారు.