ఇండియాలో పలు బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రుణాలు తీసుకుని బ్రిటన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. తాన 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానని ప్లీజ్ అవి తీసుకొని నా కేసు క్లోజ్ చేసేయండి అంటూ అభ్యర్థిస్తన్నారు. అలాగే.. తన అభ్యర్థనను అంగీకరించాలని.. తనపై ఉన్న కేసును క్లోజ్ చేయాలనీ కోరారు.
అసలేం జరిగిందంటే.. ‘20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించిన భారత ప్రభుత్వానికి ‘కంగ్రాట్స్’ చెప్తూ.. నా రుణాలు చెల్లిస్తానని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని వాపోయారు. అలాగే.. ‘ప్రభుత్వం ఎన్ని కరెన్సీ నోట్లయినా ముద్రించుకోవచ్చు. కానీ నా లాంటి ‘చిన్న చెల్లింపుదారుడు’ నా 100 శాతం అప్పులు తీరుస్తానన్నా పట్టించుకోవడం లేదు’ అని మాల్యా ట్వీట్ చేశారు. ‘దయచేసి బేషరతుగా నా డబ్బు తీసుకుని కేసు క్లోజ్ చేయండి’ అని అభ్యర్థించారు.
కాగా తనను అప్పగించాలని భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సవాలు చేస్తూ లండన్ హైకోర్టులో ఆయన వేసిన అప్పీలును కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మాల్యా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఇండియాలోని ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీ సీజ్ చేసిన విషయం కూడా తెలిసిందే.