Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటకతో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలవుతుందని, ఆ తర్వాత మోడీ ప్రధానిగా ఉండబోరని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. బెంగళూరులో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కర్నాటకలో బీజేపీ పాలన ఉన్నప్పుడు ఐదేళ్లలో ముగ్గురు సీఎంలు మారారని ఎద్దేవా చేశారు. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది కల్ల అని, విభజించి పాలించే అధికారాన్ని ఎవరూ కోరుకోరని, ప్రజాస్వామ్యదేశంలో అందరికీ స్వేచ్ఛ, చోటు ఉంటాయని, ఏ ఒక్కమతానికో, కులానికో మనదేశం పరిమితంకాదని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.
దక్షిణ భారతదేశంలో బీజేపీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని, వారి సిద్ధాంతాలు ఇక్కడ పనికిరావని వ్యాఖ్యానించారు. మనదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నింటికీ సొంత నిర్ణయాలు, సిద్ధాంతాలు ఉంటాయని, కానీ ఒక్క బీజేపీ మాత్రం వేరొకరి సిద్ధాంతాల ఆధారంగా నడుచుకుంటూ ఉంటుందని విమర్శించారు. మోడీ తమ పార్టీ నాయకులను నోరు అదుపులో పెట్టుకోవాలని ఆదేశించడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. మోడీజీ వారిని మాట్లాడనివ్వాలని, బీజేపీ నేతలు ఎలాంటి వారో తెలుసుకోవడానికి దేశానికి ఉన్న ఏకైక అవకాశం ఇదేనని, వారి వ్యాఖ్యలతోనే మనసులో ఏముందో తెలుస్తుందని ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. బీజేపీ వర్గ రాజకీయాలు చేయడం లేదని నిరూపించాలని సవాల్ విసిరారు.
బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతున్నతీరునూ ప్రకాశ్ రాజ్ విశ్లేషించారు. కర్నాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కొన్నిరోజులు బీజేపీ హవా ఉందని, అప్పుడున్న హవా ఇప్పుడు లేదని, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచార పర్వంలో దూసుకుపోయే మోడీ… కర్నాటకలో కేవలం ఐదురోజులకే పరిమితం కావడం ఇందుకు ఉదాహరణ అని ప్రకాశ్ రాజ్ విశ్లేషించారు… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసుని, బీజేపీని ఓడించాలని కర్నాటక ఓటర్లను తాను కోరుతున్నానని ప్రకాశ్ రాజ్ చెప్పారు.