కె. రాఘవ అనే ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. ఆయన వయసు 105 ఏళ్ళు. రాఘవ వయసు వింటేనే ఆశ్చర్యం అనిపిస్తోందా! అంతకు మించిన ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి వుంది. సినీ రంగంలో ఆయన అనుభవం దాదాపు 95 సంవత్సరాలు. నిజంగా ఇది నిజం. 1913 లో కాకినాడ దగ్గర్లోని ఓ కోటిపల్లి అనే ఊరిలో ఆయన జన్మించారు. 8 ఏళ్ల వయసులో తండ్రి ఏదో అన్నాడని అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయారు. రైళ్లు ఎక్కుతూ దిగుతూ ఎక్కడికి వెళుతున్నారో తెలియకుండా ప్రయాణం చేశారు. చివరకు భారతీయ చిత్ర పరిశ్రమ కి పునాదులు పడుతున్న కలకత్తా వెళ్లారు. అక్కడ మూకీ సినిమాలు తీస్తున్న ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్ గా పని చేశారు. అక్కడ నుంచి వచ్చి కొన్నాళ్ళు విజయవాడలో మారుతీ టాకీస్ కోసం పనిచేశారు.
అప్పట్లో మూకీ సినిమా ప్రదర్శన చాలా భిన్నంగా ఉండేది. సినిమా రీళ్ళతో పాటు స్క్రిప్ట్ పంపించేవారు. సినిమా ప్రదర్శన జరుగుతుండగా ఒకరు ఆ స్క్రిప్ట్ ని ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా వివరిస్తుండే వాళ్ళు. ఆలా చెప్పడంలో అప్పట్లో కస్తూరి శివరావు చాలా ఫేమస్. ఆయనకు రాఘవ సహాయకుడిగా పని చేసేవాళ్ళు. ఈ క్రమంలో ఆయన వివిధ భాషలతో పాటు సినిమా పరిజ్ఞానం పెంచుకున్నారు. ఆపై భీష్మ , పల్నాటి యుద్ధం సినిమాలకు పనిచేసిన మీర్జాపురం మహారాజు దగ్గర పని చేశారు. ఆ సమయంలో రాజావారికి ఎల్వీ ప్రసాద్ ని పరిచయం చేసింది రాఘవ. పల్నాటి యుద్ధం కొద్ది భాగం ఉండగా దర్శకుడు రామబ్రహ్మం చనిపోయారు. ఆ కొద్ది భాగాన్ని ఎల్వీ ప్రసాద్ డైరెక్ట్ చేశారు. ఆయన పనితీరు చూసే రాజాగారు ఆ పై చేసిన సాంఘిక సినిమా మనదేశం కి దర్శకత్వం చేసే ఛాన్స్ దక్కింది. ఆ సినిమాలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా తర్వాత కాలంలో వెలిగిపోయిన ఎన్టీఆర్ ఓ చిన్న రోల్ వేశారు. ఆయన్ని రైల్వే స్టేషన్ కి వెళ్లి తీసుకొచ్చింది ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న రాఘవ.ఇక ఎన్టీఆర్ హీరోగా చేసిన పాతాళభైరవికి రాఘవ ప్రొడక్షన్ బాధ్యతలతో పాటు స్టంట్ డైరెక్టర్ కూడా.
ఇలా కలకత్తా, చెన్నై మధ్య తిరుగుతూ మొత్తం 8 భాషల్లో రాఘవ పట్టు పెంచుకున్నారు. అదే రాఘవ జీవితాన్ని అనూహ్యంగా మార్చేసింది. ఓ హాలీవుడ్ సంస్థ ఓ టార్జాన్ తరహా సినిమాని ఇండియాలో షూటింగ్ చేసింది. అందుకోసం స్థానిక భాషల్లో పట్టున్న రాఘవ సహకారం తీసుకుంది. ఇక షూటింగ్ పూర్తి అయ్యాక సినిమా డబ్బింగ్ వ్యవహారాల్లోనూ ఆయన పని చేశారు. ఇందుకోసం ఆ సంస్థ ఆ రోజుల్లో పెద్ద మొత్తం ఇచ్చిందట. ఇక అప్పటినుంచి సినిమా నిర్మాణం మీద దృష్టి పెట్టారు.
సినిమా నిర్మాణం అంటే డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రమే కాదని కింద నుంచి వచ్చిన రాఘవ బాగా అర్ధం చేసుకున్నారు. అందుకే కథ, దర్శకుల విషయంలో ఆయన జాగ్రత్తగా వుండేవాళ్ళు. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉండేదో తెలుసా ? రాఘవ నిర్మాతగా 27 సినిమాలు తీస్తే అందులో 25 బ్లాక్ బస్టర్స్. ఇక ఆయన తాత మనవడు సినిమాతో దర్శకుడిగా పరిచయం చేసిన దాసరి నారాయణరావు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ ఆణిముత్యం. వందకు పైగా సినిమాలు అఆయన దర్శకత్వంలో వచ్చాయి. ఇక కోడి రామకృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిరంజీవి హీరోగా చేసిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఓ సెన్సేషన్. 27 సినిమాలు తీసాక చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులు , నిర్మాతకు తగ్గుతున్న గౌరవం చూసి దానికి దూరంగా ఉండడం మొదలు పెట్టారు.
ఎంత మంచి వృత్తిగత జీవితాన్ని చూసిన వాళ్లకి అయినా దాని నుంచి ఎప్పుడు బయటకు రావాలో తెలియక ఇబ్బంది పడతారు. కానీ రాఘవ ఈ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు దూరం అయ్యాక కానీ అంతకు ముందు కానీ ఎప్పుడూ వ్యక్తిగత క్రమశిక్షణ పాటించారు. అందుకే 105 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు. చిన్నపాటి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ తెల్లవారుజామున గుండె పోటుతో చనిపోయారు. తెలుగు చలన చిత్ర సీమ ఓ అరుదైన వ్యక్తిని , సినీ ఆణిముత్యాన్ని కోల్పోయింది.
-అరుణాచలం