Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ గవర్నర్ రేసులో తన పేరు వినిపించడంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. తాను ఏపీకి గవర్నర్ కానున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని, అవన్నీ నిరాధారమని ఆమె స్పష్టంచేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తాను చేపట్టిన కార్యక్రమాలకు మంచిపేరు వస్తోందని, తాను అక్కడే పూర్తికాలం కొనసాగుతానని ఆమె తేల్చిచెప్పారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ స్థానంలో కొత్తవారిని నియమించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారని ఏపీని పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను తొలగించాలన్న డిమాండ్ అన్ని రాజకీయ పక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. బీజేపీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తోంది. ఏపీకి కొత్త గవర్నర్ నియమించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ కూడా రాశారు. దీంతో కేంద్రం గవర్నర్ మార్పుపై దృష్టిపెట్టిందని,
ఏపీలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో కిరణ్ బేడీ లాంటి గవర్నర్ అయితే తమకు శ్రేయస్కరంగా ఉంటుందని, కేంద్రం భావించినట్టు ప్రచారం జరిగింది. అదేసమయంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి, కిరణ్ బేడీకి ఏ మాత్రం పొసగకపోవడంతో ఆమెను ఏపీకి పంపించి, పుదుచ్చేరిలో కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ను నియమిస్తారని వార్తలొచ్చాయి. కానీ కిరణ్ బేడీ మాత్రం పుదుచ్చేరిలో ఉండేందుకే ఆసక్తిచూపిస్తున్నారు.