టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్దం అవుతుంది. గత కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుతున్నారు. మరో రెండు నెలల్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసి నవంబర్ నుండి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంత భారీ బడ్జెట్‌ను కేవలం తెలుగు సినిమా పరిశ్రమలో రాబట్టడం అసాధ్యం. అందుకే బాలీవుడ్‌పై దృష్టి పెట్టాలి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు బాలీవుడ్‌లో పెద్దగా క్రేజ్ లేదు. అయినా కూడా అక్కడ భారీ ఎత్తున విడుదల చేయాలని, బాహుబలి పేరు చెప్పి ఈ చిత్రాన్ని అమ్మేయాలని నిర్మాత మరియు దర్శకుడు భావిస్తున్నాడు.
బాహుబలి చిత్రంకు బాలీవుడ్‌లో అంతటి వసూళ్లు రావడానికి ప్రధాన కారణం ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అనే విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ను కరణ్ జోహార్ భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి విడుదల చేయడంతో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక రెండవ పార్ట్‌ను కరణ్ ఒక డైరెక్ట్ సినిమా రేంజ్‌లో ప్రమోట్ చేయించాడు. దాంతో రెండవ పార్ట్ హిందీ సినిమాలను మించి వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే కరణ్ జోహార్‌కు మల్టీస్టారర్‌ను అప్పగించాలని జక్కన్న భావిస్తున్నాడు. కరణ్ తన బిజినెస్ మాయాజాలంతో తప్పకుండా ఈ చిత్రాన్ని కూడా భారీ ఎత్తున విడుదల చేయడంతో పాటు, మంచి కలెక్షన్స్ వచ్చేలా చేయగలడు అంటూ జక్కన్న నమ్ముతున్నాడు. బాలీవుడ్ నుండి 100 కోట్ల వసూళ్లను ఆశిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కరణ్ జోహార్ ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దక్కించుకోబోతున్నాడు. జక్కన్నపై ఉన్న నమ్మకంతో భారీ ఎత్తున ఈ చిత్రానికి పెట్టేందుకు కరణ్ ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి అంటే 2020 వరకు ఎదురు చూడాల్సిందే.