Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడులో అధికార పార్టీ ఉంది…ప్రతిపక్షాలూ ఉన్నాయి…. పాలనా సాగుతోంది…దానిపై విమర్శలూ వస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో సాధారణ స్థితే నెలకొన్నట్టు పైకి అనిపిస్తోంది. కానీ…. జయలలిత మరణం తరువాత… ఆ రాష్ట్రంలో ఓ విధమైన రాజకీయ శూన్యత ఏర్పడింది. స్థిరత్వంలేని అధికార పార్టీ…. అంతర్గత కలహాలు… పరిస్థితులను అనుకూలంగా మలచుకోలేని బలహీన ప్రతిపక్షం… ఇదీ ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం. ఈ శూన్యతను ఆసరగా చేసుకుని రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పుతారని అందరూ అంచనాలు వేశారు. కానీ అనూహ్యంగా…కమల్ హాసన్ రాజకీయ రంగంపై ప్రత్యక్షమయ్యారు. తమిళనాడు రాజకీయాలను మార్చివేయాలని కలలు కంటున్నారు. మరి రజనీకాంత్ పరిస్థితి ఏమిటి? సూపర్ స్టార్ కూడా రాజకీయ అరంగేట్రం చేస్తారా… ఒకవేళ ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగితే… తమిళనాడు ముఖ చిత్రం ఎలా మారిపోతుంది? ఇదీ ఇప్పడు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కమల్ లాగా… రజనీ ఎప్పుడూ తన భవిష్యత్ కార్యాచరణ గురించి ముందస్తు ప్రకటన చేయలేదు. సార్వత్రిక ఎన్నికల నాటికి పోటీకి సిద్ధమయ్యేలా…ఇప్పటినుంచే కమల్ కొత్తపార్టీకి వ్యూహరచన చేస్తున్నారు… కానీ రజనీకాంత్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి… ఆయన ఆ పార్టీలో చేరతారా లేక… కొత్త పార్టీ పెడతారా అనేదానిపై ఇంకా స్ఫష్టత లేదు. కమల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అందరూ ఆయన్నడుగుతున్న ప్రధాన ప్రశ్న…రజనీకాంత్ తో కలిసి పనిచేస్తారా… అని.. దానికి కమల్ సానుకూలంగానే స్పందిస్తున్నారు కానీ….నిజానికి రజనీ కొత్త పార్టీ పెట్టినా….. లేక బీజేపీలోనో చేరినా…వారిద్దరూ తమిళనాడులో రాజకీయ ప్రత్యర్థులు గానే మారిపోతారు. ఇద్దరి మధ్యా స్నేహం ఉన్నా…
సినిమాల్లో వాళ్ల మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్టే… రాజకీయాల్లో ప్రత్యక్ష పోరాటం జరిగే అవకాశముంది. కమల్, రజనీ కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో సూపర్ స్టార్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నడిగర్ తిలగం శివాజీ గణేశన్ స్మారకమందిరం ప్రారంభోత్సవం కార్యక్రమంలో కమల్ హాసన్, రజనీకాంత్ లు ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోనే కాకుండా… రాజకీయాల్లోనూ శివాజీ గణేశన్ గొప్ప పాఠాలు నేర్పించి వెళ్లాడని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. నటుడిగా ఉన్నతస్థానంలో ఉన్నప్పుడే శివాజీ గణేశన్ కొత్త పార్టీ స్థాపించారని, ఎన్నికల్లో పోటీచేసినా… సొంత నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేకపోయారని చెప్పిన రజనీ… ఇది ఆయనకు జరిగిన అవమానం కాదని… ఆ నియోజకవర్గ ప్రజలకు జరిగిన అవమానంగా భావించాలని అభిప్రాయపడ్డారు. ఈ ఓటమి ద్వారా శివాజీ గణేశన్… సినీ నటులకు ఓ నీతిని బోధించారని, రాజకీయాల్లో గెలుపొందాలంటే.. సినిమా ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు మాత్రమే చాలవని, దీనికి మించిన శక్తి కావాలని, రజనీకాంత్ అన్నారు. ఆ శక్తి ఏమిటో తనకు తెలియదని, తన స్నేహితుడు కమల్ హాసన్ కు మాత్రం తెలుసనుకుంటున్నానని రజనీ వ్యాఖ్యానించారు. ఆ శక్తి ఏమిటో కమల్ కు తెలిసినా తనకు చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. రెండు నెలల క్రితం అడిగినట్టయితే…చెప్పేవారేమో..అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. మొత్తానికి రజనీ చేసిన వ్యాఖ్యలు చూస్తే…త్వరలోనే ఆయన కూడా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.