కొద్ది రోజులక్రితం తిరుమల అర్చకులకి కూడా రిటైర్మెంట్ అనే అంశాన్ని టీటీడీ తెరమీదకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముందుగా పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది రమణ దీక్షితులు అయితే అప్పటి నుండి టీడీపీ మీదా టీటీడీ మీదా ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆయన దాదాపు రెండున్నర నెలల తరువాత తిరుమల చేరుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఇన్ని రోజులు తిరుమలకు రాని రమణదీక్షితులు ఇప్పుడే ఎందుకు వచ్చారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే కోర్టులో ఎంపి సుబ్రమణ్యస్వామి కేసు దాఖలు చేసిన నేపథ్యంలో ఆధారాల కోసమే రమణదీక్షితులు తిరుమలకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇంటిలోని పలు కీలక డాక్యుమెంట్లను సేకరించిన ఆయన త్వరలోనే వాటిని కోర్టులో సబ్మిట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే రెండున్నర నెలలుగా రమణదీక్షితులు తిరుమలకు రాకున్నా ఆయనకు కేటాయించిన ఇంటి దగ్గరకు ఎవరూ వెళ్ళలేదు. సాధారణంగా ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తరువాత వారికి కేటాయించిన క్వార్టర్స్‌ను ఖాళీ చేయిస్తుంది టిటిడి. అయితే రమణదీక్షితులపై పదవీ విరమణ వేటు వేసినప్పటికీ ఇంతవరకు ఆయన ఇంటి గేటు దగ్గరకు కూడా సిబ్బందిని పంపే ప్రయత్నం చేయలేదు టిటిడి. పైగా రమణదీక్షితులు తన పెంపుడు కుక్కలని రెండున్నర నెలలుగా తిరుమలలోని తన క్వార్టర్స్‌కు కాపలా ఉంచడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. కుక్కలు ఆయన నివాసం బయటే ఉన్నా వాటిని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం కూడా టిటిడి అధికారులు చేయకపోవడం గమనార్హం.
అయితే తిరుమలకు వచ్చిన రమణదీక్షితులను వైసిపి నేత, మాజీ టిటిడి బోర్డు ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్ళి మరీ ఏకాంతంగా కలిసి చర్చలు జరిపారు. అయితే తర్వాత బయటకి వచ్చిన కరుణాకర్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తే శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తూనే టీటీడీ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేసి, బోర్డు తొలి సమావేశంలోనే రమణ దీక్షితులును తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, బోర్డు మాజీ చైర్మన్‌గా తాను ఈహామీ ఇస్తున్నట్లు తెలిపారు.
అంటే వైసీపీ అధికారంలోకి వస్తే రమణ దీక్షితులే మరలా ప్రధాన అర్చకులు అన్నమాట. అయితే ఈ విషయం విన్న తరువాత మిగిలిన అర్చక సిబ్బంది వైసీపీ ఇక గెలవకూడదని మొక్కుకుంటున్నారట. ఎందుకంటే రామ దీక్షితుల ఆధ్వర్యంలో పూజలు జరిగిన సమయంలో అంతా ఆయన ఇస్తా ప్రకారమే జరిగేవని, వన్ మ్యాన్ షో అన్నట్టు వ్యవహారం నడిచేదని కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని మరలా ఇప్పుడు వైసీపీ గెలిస్తే ఆయన ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న తమ మీదకి ఎక్కడ ఎక్కుతారో అని వారు వైసీపీ ఓటమి కోసం మొక్కుకుంతున్నారట. ఈ విషయం ఎవరో సోషల్ మీడియాలో రాసుకున్నా అది ఎంతవరకు వాస్తవం అనేది పాటకులకి చెప్పక్కర్లేదనుకుంటా !