అఖిల్ , హలో సినిమాకు అక్కినేని అభిమానుల ఆశలు, అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సినిమాగా అఖిల్ ఎలాంటి సినిమా చేయాలి ? ఇదే ఇప్పుడు అక్కినేని క్యాంపు కి సవాల్ విసురుతున్న ప్రశ్న. కమర్షియల్ సినిమా చేయడమా , సరి కొత్త ప్రయోగం చేయడమా అన్న విషయంలో అఖిల్ తో పాటు నాగార్జున కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అలాంటి టైం లో అఖిల్ కెరీర్ ని కొత్త మలుపు తిప్పేందుకు రానా ముందుకు వచ్చాడట. తానే నిర్మాతగా అఖిల్ మూడో సినిమా చేయడానికి రానా రెడీ అవ్వడమే కాదు ఓ మంచి కథ వున్న దర్శకుడుని కూడా అఖిల్ కి అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు మీద అంత పెద్ద బాధ్యత పెట్టడానికి ఇంకో కారణం ఏమీ లేదంట. ఆయన దగ్గర వున్న సరికొత్త కథ,కధనం తప్ప.
రానా మాట మీద నమ్మకంతో అఖిల్ కూడా ఆ దర్శకుడి కథ విన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడు నాలుగు సిట్టింగ్స్ జరిగాయట. అంతా అనుకున్నట్టు అయితే ఈ వారంలో ఆ కాంబినేషన్ లో రానా నిర్మాతగా సినిమా అనౌన్స్ చేసినా ఆశ్చర్యపవాల్సిన పనిలేదట. ఇంతకీ అఖిల్ , రానా లని అంతగా ఇంప్రెస్ చేసిన ఆ దర్శకుడు ప్రముఖ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి కొడుకు సత్య పినిశెట్టి. ఆయన ఇంతకుముందు సోదరుడు ఆది పినిశెట్టి తో మలుపు అనే ఓ సినిమా తీసాడు. ఆ సినిమాకు పేరు వచ్చింది గానీ డబ్బులు పెద్దగా రాలేదు. అయితే కుర్రోడిలో స్పార్క్ ఉందన్న టాక్ వచ్చింది. ఇప్పుడు అతను చెప్పిన కథ నచ్చడంతో రానా , అఖిల్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.