Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా నచ్చిన వ్యక్తులతో మళ్లీ మళ్లీ పనిచేయడం అన్నది చాలా కామన్. హిట్ కాంబినేషన్ అన్న పదం ఇలా వచ్చినదే. హీరో, హీరోయిన్లనే కాదు. డైరెక్టర్-హీరో, హీరో-మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ – మ్యూజిక్ డైరెక్టర్ , డైరెక్టర్ – హీరోయిన్, హీరో- ప్లేబాక్ సింగర్ ఏ కాంబినేషన్ అయినా రిపీట్ అవడం జరుగుతూ ఉంటుంది. తెలుగులో పాతతరం సినిమాల నుంచే ఈ సంప్రదాయం ఉంది. తొలి రోజుల్లో అన్నపూర్ణ పిక్చర్స్ కు సంబంధించిన చిత్రాలన్నింటిలో ఎక్కువగా హీరోయిన్ గా సావిత్రే ఉండేవారు. అలాగే హీరోయిన్ జమున చాలా చిత్రాల్లో గాయని జమునారాణితో ఎక్కువ పాటలు పాడించుకునేవారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సొంత బ్యానర్ చిత్రాల్లో ఎక్కువగా జయప్రద నటిస్తుండేవారు. జయసుధ దాసరి నారాయణరావు సినిమాలకు ఆస్థాన నాయకి అన్న పేరుండేది. అలాగే తర్వాత రోజుల్లో చిరంజీవి- కోదండరామిరెడ్డి, బాలకృష్ణ- కోడిరామకృష్ణ, టి కృష్ణ-విజయశాంతి, రాఘవేంద్రరావు- రమ్యకృష్ణ, రాంగోపాల్ వర్మ- ఊర్మిళ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హిట్ కాంబినేషన్లే ఉన్నాయి.
సినిమాలు ఘనవిజయం సాధించడంతో పాటు, గతంలో పనిచేసిన వాళ్లతోనే మళ్లీ కలిసి చేయడం వల్ల వచ్చే కంఫర్ట్ నెస్ ఇలా హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడానికి కారణాలు. సినిమాకు ఆయువుపట్టుగా నిలిచే సంగీతం విషయంలోనూ ఈ హిట్ కాంబినేషన్ కు చాలా ప్రాధాన్యం ఉంది. కె. విశ్వనాథ్- కె.వి.మహదేవన్, మణిరత్నం- ఎఆర్ రెహ్మాన్, రాఘవేంద్రరావు- చక్రవర్తి, రాఘవేంద్రరావు- ఎం.ఎం. కీరవాణి, తేజ-ఆర్పీపట్నాయక్ ఇలా ఎందరో మ్యూజిక్ డైరెక్టర్లు, డైరెక్టర్లు తమ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు. ఆ కోవలోనే టాలీవుడ్ లో చెప్పుకోతగ్గ మరో దర్శక, సంగీత దర్శక జోడి త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవిశ్రీప్రసాద్ అని చెప్పుకోవచ్చు. వారిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు సంగీతం పరంగా ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జల్సా సినిమా ఫలితం ఎలా ఉన్నా…మ్యూజిక్ పరంగా…ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. జల్సా..కరో కరో జల్సా అంటే సాగే ఫాస్ట్ బీట్ లు యువతను ఉర్రూతలూపాయి.
జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అయితే తర్వాత ఎందుకనో గానీ వారి కాంబినేషన్ రిపీట్ కాలేదు. అ ఆ సినిమాకి సంగీతదర్శకుడిగా మిక్కీజేమేయర్ కు అవకాశమిచ్చారు త్రివిక్రమ్. దేవిశ్రీప్రసాద్ బిజీగా ఉండడమే దీనికి కారణమనుకున్నారు అప్పట్లో. కానీ తరువాత పవన్ కళ్యాణ్ తో తీస్తున్న అజ్ఞాతవాసికి కూడా దేవిశ్రీప్రసాద్ ను తీసుకోలేదు త్రివిక్రమ్. పవన్ కు జల్సా, అత్తారింటికి దారేది లాంటి సెన్సేషనల్ మ్యూజికల్ హిట్స్ అందించిన దేవిశ్రీని కాదని త్రివిక్రమ్ తమిళ సంగీతదర్శకుడు అనిరుధ్ ను ఎంచుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. తాజాగా…ఎన్టీఆర్ తో తీయబోయే మూవీకి సైతం మ్యూజిక్ డైరెక్షన్ చాన్స్ త్రివిక్రమ్ అనిరుధ్ కే ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, దేవిశ్రీ మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తాయనే గుసగుసలు విన్పిస్తున్నాయి ఫిలింనగర్ లో. అయితే వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమేమిటో మాత్రం తెలియరాలేదు. అభిమానులు మాత్రం…త్రివిక్రమ్, దేవిశ్రీలు ఇద్దరూ కలిసి కూర్చుని తమ విభేదాలను పరిష్కరించుకుని మరో మ్యూజికల్ హిట్ అందించాలని కోరుకుంటున్నారు.