Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వారిద్దరూ పాఠశాల స్థాయి నుంచి కలిసి క్రికెట్ ఆడారు. అక్కడే ఎన్నో రికార్డులు సృష్టించారు. తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. కానీ వారిలో ఒకరు క్రికెట్ లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగితే మరొకరు మాత్రం పట్టుమని పదేళ్లు కూడా టీమిండియాకు ఆడలేకపోయారు. ఆటపై కాక ఇతర విషయాలపై దృష్టి మళ్లించి ఒకరు చేజేతులారా కెరీర్ నాశనం చేసుకుంటే మరొకరు క్రికెట్ నే శ్వాసగా మార్చుకుని… ఉన్నత శిఖరాలు అధిరోహించారు. జయాపజయాలు మానవసంబంధాలపై చూపే ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్నేహం కూడా దీనికి అతీతమేమీ కాదు. ఒకరు ఉన్నతస్థానానికి ఎదగడం, మరొకరు ప్రారంభించిన చోటే ఆగిపోవడంతో ఆ ఇద్దరి మధ్య నెమ్మదిగా విభేదాలు మొదలయ్యాయి. నిజానికి మనతో ఉండే స్నేహితుడు ముందుకెళ్లే క్రమంలో మనల్ని పట్టించుకోకపోతే… ఎవరికైనా బాధ కలుగుతుంది… అయితే అందరూ తమ బాధను మనసులోనే దాచుకుంటారు. కొందరు మాత్రం బయటకు వెల్లడిస్తారు. అలా స్నేహితుడి ప్రవర్తనపై కలిగిన ఆవేదనను బయటకు చెప్పడం… ఆ చిన్ననాటి స్నేహితుల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. అన్ని సందర్బాల్లోనూ కలిసి నడవాల్సిన స్నేహితులు అతిముఖ్యమైన సందర్భాల్లో సైతం దూరంగానే ఉన్నారు. ఒకరినొకరు ముఖాముఖి చూసుకోడానికి కూడా వారు ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు ఆ విభేదాలన్నింటికీ తెరపడింది. పాతస్నేహితులు మళ్లీ ఒక్కటయ్యారు. ఇదంతా… భారత్ క్రికెట్ లో ఒకప్పుడు హిట్ కాంబినేషన్ గా పేరుతెచ్చుకున్న సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ గురించి.
చిన్నతనం నుంచి ఇద్దరి మధ్యా మంచి స్నేహబంధం ఉంది. ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలుస్తూ… క్రికెట్ ను కలిసి నేర్చుకున్నారు. బాల్యంలోనే గొప్ప ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ క్రమంలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. కానీ జట్టులోకి వచ్చిన తరువాత ఇద్దరు దారులు వేరయ్యాయి. సచిన్ సుధీర్ఘకాలం టీమిండియాకు ఆడితే… కాంబ్లీ మాత్రం జట్టులోకొచ్చిన కొన్నేళ్లకే ఉద్వాసనకు గురయ్యాడు. సచిన్ పైకెదగడం, తాను అధః పాతాళానికి పడిపోవడం… తర్వాతిరోజుల్లో కాంబ్లీని తీవ్ర వేదనకు గురిచేసింది. మనసులో మాట చెప్పే ఓ హిందీ కార్యక్రమంలో సచిన్ వైఖరిని ప్రస్తావించి కాంబ్లీ ఆవేదన వ్యక్తంచేశాడు. తన కెరీర్ పతనం అవుతున్నప్పుడు వ్యక్తిగతంగా గానీ, ప్రొఫెషన్ పరంగాగానీ సచిన్ తనకు అండగా నిలవలేదని బాధపడుతూ కన్నీరు పెట్టుకున్నాడు కాంబ్లీ. ఇది అప్పట్లో కలవరం రేపింది. అయితే కాంబ్లీ వ్యాఖ్యలపై సచిన్ ఎక్కడా స్పందించలేదు. తర్వాతిరోజుల్లో కాంబ్లీ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా పరామర్శించేందుకు సచిన్ వెళ్లలేదు. అలాగే తన వీడ్కోలు కార్యక్రమానికి కూడా కాంబ్లీకి ఆహ్వానం పంపలేదు. దీంతో ఇద్దరి మధ్య బాగా మనస్ఫర్ధలు వచ్చాయని, మళ్లీ తమ మధ్య స్నేహాన్ని వారు పునరుద్దరించుకునే అవకాశం లేదని అంతా భావించారు. కానీ… ఎలా జరిగిందో కానీ సచిన్, కాంబ్లీ మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోయాయి.
గత నెలలో వినోద్ కాంబ్లీ ఇన్ స్టాగ్రాంలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. తన చిన్ననాటి మిత్రుడు సచిన్ తో తొలి సెల్ఫీ అని కామెంట్ పెట్టాడు. తామిద్దరం కలిసిపోయామని కూడా కాంబ్లీ ప్రకటించాడు. ఇప్పుడు సచిన్ కూడా కాంబ్లీని తన జీవితకాల స్నేహితుల్లో ఒకడిగా అభివర్ణించాడు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి సచిన్, కాంబ్లీ, అతుల్ కస్బేకర్, అజిత్ అగార్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా దిగిన ఫొటోను షేర్ చేసిన సచిన్ క్రికెట్ తనకు ఈ జీవితకాల స్నేహితుల్ని అందించిందని, వారి సహచర్యంలో ముభావంగా ఉండే సందర్భం ఒక్కటి కూడా ఉండదని కామెంట్ చేశాడు. సచిన్ ఫొటోకు నెటిజన్లు బాగా రియాక్టవుతున్నారు. చిన్ననాటి స్నేహితులు విభేదాలు మర్చిపోయి కలిసిపోవడం శుభపరిణామం అంటున్నారు.