Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆయన దేశంలోనే అత్యంత ప్రముఖుడైన క్రీడాకారుడు. ఆటగాడిగా ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఎన్నో ఎత్తులు అధిరోహించాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ క్రీడాకారుడికి గురువారం ఎదురయినలాంటి అనుభవం ఇన్నేళ్లలో ఎప్పుడూ కలగలేదు. రాజకీయాలు, అవి సృష్టించే గందరగోళ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకు ఇవాళ ప్రత్యక్షంగా తెలిసివచ్చింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది ఎవరికోకాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు. మైదానంలో నిప్పులు చెరిగే బంతులను నింపాదిగా బౌండరీకి తరలించిన సచిన్… రాజ్యసభలో రాజకీయ నాయకుల వ్యవహారశైలి చూసి మాత్రం మౌనంగా ఉండిపోయారు. క్రీడా ప్రముఖుడి హోదాలో ఐదేళ్ల క్రితం రాజ్యసభకు ఎంపికయిన సచిన్…
పార్లమెంట్ సమావేశాల సమయంలో సభకు చాలా తక్కువసందర్భాల్లో మాత్రమే హాజరయ్యాడు. సభలో ఉన్న సమయంలో కూడా చర్చల్లో పాల్గొనకుండా… దేనిపైనా ప్రసంగించకుండా మౌనంగా ఉంటాడనే విమర్శలూ సచిన్ పై తరచుగా వినిపించేవి. ఈ నేపథ్యంలో సచిన్ రాజ్యసభలో తన గళమెత్తాలని నిర్ణయించుకున్నాడు. తాను ప్రసంగించబోయే అంశంపై స్వయంగా నోటీసు కూడా ఇచ్చాడు. రైట్ టు ప్లే అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగిస్తానని తెలిపాడు. అన్నీ సిద్ధంచేసుకుని సభకు వచ్చాడు. అటు టీవీ చానళ్లు, సోషల్ మీడియాతో పాటు సచిన్ అభిమానులు, సాధారణ ప్రజలు కూడా సచిన్ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ చివరకు వారందరికీ నిరాశే మిగిలింది. అర్ధం లేని కారణాలతో తరచూ సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించే రాజకీయ నాయకులు సచిన్ ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ ఉదయం రాజ్యసభకు వచ్చిన సచిన్ తన సమయం రాగానే మాట్లాడేందుకు సీటు వద్ద లేచి నిల్చున్నాడు. అయితే పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి రాజ్యసభ కార్యకాలాపాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ సభ్యులు గురువారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రసంగించేందుకు సచిన్ లేచి నిల్చున్నా…కాంగ్రెస్ ఎంపీల నినాదాలు ఆగలేదు. దీంతో మాట్లాడే సమయం కోసం చూస్తూ సచిన్ తన సీట్లో దాదాపు పదినిమిషాల పాటు నిశ్శబ్దంగా నిలబడ్డారు. అయినా సభలో హోరు ఆగలేదు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యంచేసుకుని, సచిన్ ను మాట్లాడనివ్వాల్సిందిగా కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు వెంకయ్య ప్రకటించారు. సచిన్ ప్రసంగంకోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కాంగ్రెస్ సభ్యులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవేదికగా సచిన్ ఎంతో పేరు తెచ్చుకున్నాడని, అలాంటి వ్యక్తి సభలో మాట్లాడుతుంటే అడ్డుకోవడం సిగ్గుచేటని ఎంపీ జయాబచ్చన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ నాయకులకు మాత్రమే సభలో మాట్లాడే హక్కుఉందా అని ప్రశ్నించారు. మొత్తానికి తొలిసారి ఓ ప్రజాప్రయోజన అంశంపై మాట్లాడాలనుకున్న సచిన్ కు రాజ్యసభలో జరిగిన పరిణామం తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.