Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ మధ్య విభేదాలు సమసిపోయాయి. తిరిగి గోపీచంద్ అకాడమీలో చేరాలని సైనా నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సైనా స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించింది. గోపీచంద్ అకాడమీలో తిరిగి చేరాలని కొంతకాలంగా ఆలోచిస్తున్నానని, ఈ విషయపై ఆయనతో చర్చించానని సైనా తెలిపింది. తనకు తిరిగి శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించిన గోపీచంద్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సైనా ట్వీట్ చేసింది. ఆయన ఆధ్వర్యంలో మరిన్ని లక్ష్యాలు చేరుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తంచేసింది.
గత మూడు సంవత్సరాలుగా తనకు శిక్షణ ఇచ్చిన విమల్ కుమార్ కు ఆమె ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది.విమల్ ఆధ్వర్యంలోనే తాను ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును అందుకున్నానని, 2015, 2017 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత, కాంస్య పతకాలతో పాటు ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లను సాధించటంలో ఆయన కీలక పాత్ర పోషించారని సైనా తెలిపింది. తిరిగి సొంతగూటికి చేరుకోవటం, హైదరాబాద్ లో శిక్షణ పొందడం చాలా సంతోషంగా ఉందంది. మూడేళ్ల క్రితం వరకు సైనా నెహ్వాల్ గోపీచంద్ అకాడమీలోనే శిక్షణతీసుకుంది.
2012 లండన్ ఒలంపిక్స్ లో సైనా కాంస్య పతకం గెలిచినప్పుడు ఆమె కోచ్ గోపీచందే.ఆ సమయంలో గోపీచంద్, సైనా పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగాయి.గోపీచంద్ శిక్షణలోనే తాను రాటుదేలినట్టు సైనా తరచుగా చెప్తుండేది. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో 2014లో ఆసియా గేమ్స్ కు ముందు సైనా…గోపీచంద్ అకాడమీని వదిలి బెంగళూరు వెళ్లింది. అక్కడ విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందింది. ఈ మూడేళ్ల కాలంలో గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ పొందిన పి.వి. సింధు ఒలంపిక్స్ లో రజత పతకం సాధించటంతో సైనా స్థానాన్ని సింధు ఆక్రమించిందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు తిరిగి గోపీచంద్ గూటికి చేరాలని సైనా నిర్ణయించుకోవటంతో ప్రపంచ బ్యాడ్మింటన్ లో వీరిద్దరూ కలిసి మరిన్ని అద్భుతాలు సృష్టించగలరని భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు: