ఏపీ ప్రభుత్వం చేపట్టిన గన్‌మెన్‌ల కుదింపు, తొలగింపు పెను దుమారాన్ని రేపుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రజాప్రతినిధులకు ఉన్న గన్‌మెన్‌లను పోలీసు అధికారులు వెనక్కి పిలిపించారు. మాజీ మంత్రులకు మాత్రమే గన్‌మెన్ లను ఉంచారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు 2 + 2 విధానంలో అంగరక్షకులు ఉండేవారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఓటమి పాలైన ప్రజాప్రతినిధులకు ఉన్న గన్‌మెన్‌లను ప్రధాన కార్యాలయాలకు రప్పించారు. తాజాగా ఎమ్మెల్సీగా ఉన్న బుద్దా వెంకన్నకు ఉన్న గన్‌మెన్‌లను కుదించారు. ఆయనకు 2 + 2 గన్‌మెన్‌లు ఉండగా 1 + 1గా మార్చారు. దీనిపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన గన్‌మెన్‌లను కమిషనరేట్‌కు పంపేశారు. వాస్తవానికి విజయవాడలో నివాసం ఉండే ప్రజా ప్రతినిధులు, మంత్రులకు సిటి సెక్యూరిటి వింగ్ నుంచి గన్ మెన్ లను కేటాయిస్తారు. జిల్లాలోని మిగతా ప్రజా ప్రతినిధులకు ఆర్మ్ డ్ రిజర్వ్ విభాగం నుంచి గన్ మెన్ లను పంపుతారు. కాగా, గన్ మెన్ ల ఉపసంహరణ తమ చేతుల్లో లేదని, స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏర్పడిన కమిటీ సూచనల మేరకే భద్రత ఖరారవుతుందని చెబుతున్నారు.