Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫీల్ గుడ్, విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న శేఖర్ కమ్ముల తాజాగా ‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ‘ఫిదా’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో శేఖర్ కమ్ముల తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫిదా వచ్చి దాదాపు సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లింది లేదు. గత కొన్నాళ్లుగా శేఖర్ కమ్ముల అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో ఉన్న శేఖర్ కమ్ముల తన తర్వాత సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.
శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు చాలా తక్కువ సినిమాలు మాత్రమే చేశాడు. తక్కువ సినిమాలు చేస్తూ ఎక్కువ పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈయన ఆచి తూచి చిత్రాలు చేస్తున్నాడు. ‘ఫిదా’ వంటి మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తాడా లేక ‘హ్యాపీడేస్’ లేదా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి క్లాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తాడా అనే విషయం చూడాలి. గతంలో మహేష్‌బాబును ఈయన డైరెక్ట్ చేయాలని కోరుకున్నాడు. కాని ప్రస్తుతం మహేష్ బిజీగా ఉన్న కారణంగా చిన్న హీరోతో శేఖర్ కమ్ముల చిత్రాన్ని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంవత్సరంలో శేఖర్ కమ్ముల సినిమాను ప్రారంభించి వచ్చే సంవత్సరంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి శేఖర్ కమ్ముల ఈ సంవత్సరంలో సినిమాను విడుదల చేసే అవకాశం లేదని తేలిపోయింది.