పొగాకు పై శ‌ర‌ద్ ప‌వార్ కామెంట్…

Sharad Pawar regrets consuming tobacco

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పొగాకు క్యాన్స‌ర్ కార‌కం… సినిమాహాళ్ల‌లోనూ, టీవీ చాన‌ళ్లలోనూ, బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనూ ఈ ప్ర‌క‌ట‌న ఎక్క‌డ‌చూసినా క‌నిపిస్తోంది. పొగాకు వ‌ల్ల క‌లిగే అనారోగ్యాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌భుత్వాలు చాలా చర్య‌లే తీసుకుంటున్నాయి. ధూమ‌పానం, మ‌ద్య‌పానానికి వ్య‌తిరేకంగా ఎన్నో ప్ర‌క‌ట‌న‌లు రూపొందిస్తున్నాయి. 40 ఏళ్ల‌క్రితం త‌న‌ను ఎవ‌రైనా ఇలా హెచ్చ‌రించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్. నోటి క్యాన్స‌ర్ ను రూపుమాపేందుకు ఏర్పాట‌యిన ఇండియ‌న్ డెంట‌ల్ అసోసియేష‌న్ మిష‌న్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న… పొగాకు వ‌ల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులు వివ‌రించారు.

పొగాకు, సుపారీ తినొద్ద‌ని 40 ఏళ్ల కింద‌టే త‌న‌ను ఎవ‌రైనా హెచ్చ‌రించి ఉంటే బాగుండేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తంచేశారు. క్యాన్స‌ర్ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు తాను శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల్సివ‌చ్చింద‌ని, అయితే ఆ స‌ర్జ‌రీ త‌న‌ను ఎంత‌గానో వేధించింద‌ని, ప‌వార్ చెప్పారు. శ‌స్త్ర చికిత్స స‌మ‌యంలో పళ్లు తీసేసార‌ని, దీనివ‌ల్ల తాను నోరు పెద్ద‌గా తెర‌వ‌లేక‌పోతున్నాన‌ని, మాట్లాడ‌డానికి, ఆహారం తీసుకోవ‌డానికి చాలా ఇబ్బందిగా ఉంటోంద‌ని ఆయ‌న బాధ‌ప‌డ్డారు. పొగాకు, సుపారీకి అల‌వాటుప‌డి తాను చాలా త‌ప్పు చేశాన‌ని ఆయ‌న ప‌శ్చాత్తాపం వ్య‌క్తంచేశారు. ఇప్ప‌టికీ చాలా మంది యువ‌త ఇలాంటి దుర‌ల‌వాట్ల‌కు బానిస‌వుతున్నార‌ని, వారికి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని, పార్ల‌మెంట్ లోనూ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తాన‌ని శ‌ర‌ద్ ప‌వార్ చెప్పారు.