Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రకాశం జిల్లా రాజకీయాలు సరికొత్త మలుపు తిరగబోతున్నాయా ?.ఔను …రేసులో వున్న రెండు ప్రధాన పార్టీలు ఇటు టీడీపీ, అటు వైసీపీ కూడా ఇదే ఆలోచనతో వున్నాయి. అందుకు తగ్గట్టే పావులు కదుపుతున్నాయి. ప్రకాశం రాజకీయాలు అనగానే రెండేళ్లుగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది అద్దంకి. ఇక్కడ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య వైరం గురించి తెలిసిందే. టీడీపీ అంతర్గత కలహాలతో ఈ నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. అధిష్టానం జోక్యంతో చప్పబడడం, మళ్ళీ వీలు దొరికితే రెచ్చిపోవడం ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది. అద్దంకితో పాటు మరో రెండు మూడు నియోజకవర్గాల్లో వైసీపీ కి గట్టి అభ్యర్థులు లేరు. దర్శిలో బూచేపల్లి వైసీపీ తరపున నిలబడేది లేదని తేల్చేశారు. అటు టీడీపీ లో కూడా తమకు తగిన ప్రాధాన్యం లేదని బలరాం సహా కొందరు నాయకులు రగిలిపోతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ లో పరిస్థితిని చక్కదిద్దుకోడానికి టీడీపీ , వైసీపీ రంగంలోకి దిగాయి. ఇప్పుడు వున్న నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడం ఇక కుదరని పని అని తేలిపోవడంతో పక్క పార్టీ నేతల మీద రెండు పక్షాలు దృష్టి పెట్టాయి. వైసీపీ నుంచి వచ్చే నేత వల్ల ఉపయోగం ఉంటుందా ,లేదా అని టీడీపీ సర్వే బృందాలు కసరత్తు చేస్తున్నాయి. అటు ప్రశాంత్ కిషోర్ తరపున కూడా ప్రకాశంలో పర్యటిస్తున్న బృందాలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బలరాం పార్టీలోకి వస్తే జిల్లాలో ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న కోణంలో సర్వే చేస్తున్నాయి. ఈ వ్యవహారం చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
జిల్లాలో ఒకప్పుడు చురుగ్గా రాజకీయాలు చేసి ప్రస్తుతం సైలెంట్ అయిన ఓ నాయకుడిని రెండు పార్టీల తరపున సర్వే బృందాలు కలిసి ఆయన అభిప్రాయం తెలుసుకున్నాయట. అయితే వైసీపీ వాళ్ళు టీడీపీ నాయకుడు తమ అభ్యర్థి అయితే అని ప్రశ్నించడం , టీడీపీ బృందం వైసీపీ నేత తమ కాండిడేట్ అయితే ఎలా ఉంటుందని అడగడంతో ఆయన కి కూడా మైండ్ బ్లాక్ అయ్యిందట. ఆ బృందాలతో మాట్లాడాక తన సన్నిహితులతో జంబలకిడిపంబ సర్వే లు జరుగుతున్నాయి అని సరదాగా వ్యాఖ్యానించారట.