Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలు ఏదన్నా కారణంతో విడిపోతే… అనంతరం ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు కారాలూ మిరియాలు నూరుకుంటుంటారు. ఒకరికొకరు ఎదురుపడినా… ఏ కార్యక్రమంలోనైనా కలిసి పాల్గొనాల్సి వచ్చినా ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శించుకుంటుంటారు. దేశంలోని భాగస్వామ్యపార్టీలన్నీ ఇదే వైఖరితో ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు కానీ… టీడీపీతో వారు శత్రువుల్లా ఏమీ వ్యవహరించడం లేదు. అలాగే టీడీపీ నేతలు కూడా… బీజేపీ మాజీ మంత్రులపై విమర్శలు గుప్పించడం, ఆరోపణలకు దిగడంలాంటివేవీ చేయలేదు. కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మంత్రి పదవులకు రాజీనామా చేసినప్పుడు కూడా టీడీపీ నేతలు వారితో స్నేహపూర్వకంగానే వ్యవహరించారు. వారు కూడా రాజీనామా లేఖల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇది జరిగి కొన్నిరోజులు గడిచినప్పటికీ నేతల ప్రవర్తనలో మార్పేమీలేదు. జాతీయ స్థాయిలో బీజేపీ, టీడీపీ బద్దశత్రువులుగా మారిపోయినప్పటికీ… రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీల నేతల మధ్య సుహృద్భావ వాతావరణమే నెలకొంది.
తాజాగా అసెంబ్లీ లాబీల్లో జరిగిన ఓ ఘటన మరోసారి ఈ విషయాన్ని రుజువుచేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబును తప్పించి ఆ స్థానంలో మాణిక్యాలరావును నియమిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్యే కళావెంకట్రావు, మహిళాకమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారికి, మాణిక్యాలరావుకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కొత్త శత్రువులకు నమస్కారం అని కళా వెంకట్రావు, అడ్వాన్స్ కంగ్రాట్స్ అని నన్నపనేని నవ్వుతూ మాణిక్యాలరావును పలకరించారు. వెంటనే స్పందించిన మాణిక్యాలరావు నేనేమీ బీజేపీ అధ్యక్షుడిని కావడం లేదు. సోము వీర్రాజు అవుతున్నారు. ఆయన్ని నేనే ప్రతిపాదించా అన్నారు. దీనికి స్పందించిన నన్నపనేని ఏపీ బీజేపీకి కాబోయే అధ్యక్షుడు మాణిక్యాలరావే అంటున్నారు… అని అనడంతో, టీడీపీకి సోము వీర్రాజు అయితేనే సరిపోతాడంటూ మాణిక్యాలరావు వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మొత్తానికి విడిపోయినప్పటికీ… టీడీపీ, బీజేపీ నేతలు శత్రువుల్లా కాకుండా… మిత్రుల్లానే మాట్లాడుకోవడం మంచి పరిణామం.