Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘రంగస్థలం’ చిత్రం సూపర్ హిట్ టాక్ దక్కించుకున్నా కూడా చిత్ర యూనిట్ సభ్యులకు కొన్ని వివాదాలు తలనొప్పిని తెస్తున్నాయి. సినిమాలోని ఆగట్టునుంటావా నాగన్న… అనే పాటను శివనాగులుతో పాడివ్వడం జరిగింది. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆ పాటను శివనాగులుతో పాడివ్వడంతో పాటు, అందరి ముందు దేవిశ్రీ ప్రసాద్ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించాడు. తీరా సినిమాలో మాత్రం శివనాగులు వాయిస్‌తో కాకుండా దేవిశ్రీ ప్రసాద్ వాయిస్‌తో ఆ పాట ఉంది. దాంతో అవాక్కయిన శివనాగులు మీడియా ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎట్టకేలకు దర్శకుడు సుకుమార్ శివనాగులుతో మాట్లాడి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు.
ఈ పాట వివాదంపై దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ… పాట చిత్రీకరణ సమయంలో శివనాగులుతో పాట రికార్డ్ చేయలేదు. హడావుడిగా ఆ పాట చిత్రీకరణ చేయాల్సి ఉండటంతో దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాటతో చిత్రీకరించాం. ఆ తర్వాత ఆ పాట స్థానంలో శివనాగులు పాటను ఉంచాలని భావించాం. కాని పాట వాయిస్ సింగ్ అవ్వక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శివనాగులు పాటను కాకుండా దేవిశ్రీ పాటను ఉంచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆడియో పోర్టల్స్ మరియు అధికారిక ఆల్బమ్‌లో మాత్రం శివనాగులు పాట ఉంటుందని సుకుమార్ చెప్పుకొచ్చాడు. సుకుమార్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో పాట వివాదంకు ఇక ఫుల్ స్టాప్ పడ్డట్లే అని భావించవచ్చు.