Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మరణశిక్ష…ఇది అమలు చేయాలా వద్దా అన్నదానిపై మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రాణాన్ని ఇవ్వలేని ప్రభుత్వానికి దాన్ని తీసే హక్కులేదని, కాబట్టి మరణశిక్షను రద్దుచేయాలని మానవ హక్కుల ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అత్యంత తీవ్రమైన నేరానికి పాల్పడ్డ వారికి మరణ దండనే సరైన శిక్షని ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు మరణశిక్షను తుదిశిక్షగా భావిస్తున్నాయి. మరణశిక్షను అమలు చేసే విధానంలో ఒక్కో దేశం ఒక్కో పద్ధతిని పాటిస్తోంది. కొన్ని దేశాలు ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చోబెట్టి మరణ దండన అమలు చేస్తే..మరికొన్ని దేశాలు ఉరివేయడం ద్వారా ప్రాణాలు తీస్తున్నాయి. మన దేశంలోనూ మరణదండనను ఉరిశిక్ష రూపంలో అమలుచేస్తున్నారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉరిశిక్ష విధానాన్ని మార్చాలని కోరుతూ రిషి మల్హోత్రా అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్టికల్ 21 ప్రకారం ప్రతిఒక్కరికి జీవించే హక్కు ఉంటుందని, జైలు శిక్ష అనుభవించే ఖైదీలకూ అది వర్తిస్తుందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఖైదీల మరణం గౌరవప్రదంగా, బాధ తక్కువగా ఉండేలా చూడాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విలక్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మరణం మరింత ప్రశాంతంగా ఉండేలా శిక్షలు ఆలోచించాలని ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఏ వ్యక్తీ బాధపడుతూ చనిపోవాలని అనుకోడని, ప్రశాంతంగా మరణించాలని కోరుకుంటాడని ధర్మాసనం పేర్కొంది. మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిజానికి తన చావు గురించి రోజులు, గంటలు, నిమిషాలు, సెకన్లతో సహా ఒక మనిషికి ముందు తెలియడం అంత బాధాకరమైన సంగతి మరొకటి లేదు. అలాంటి బాధ తప్పనిసరయినప్పుడు దాన్ని మరింత ఆవేదనాభరితంగా అమలు చేయడం కన్నా…కాస్త మానవత్వంతో ఆలోచించి ప్రశాంతంగా మరణించే పరిస్థితులు కల్పించడం సరైనదని పలువురు వాదిస్తున్నారు.