Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దైనందిన జీవితంలో ప్రతి అంశాన్ని ఆధార్ కు లింక్ పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. వ్యక్తిగత గోప్యత అన్నది వ్యక్తుల ప్రాథమిక హక్కే అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ను విచారించిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అని ఆధార్ కార్డుతో అనుసంధానం ఈ హక్కును హరించివేస్తోందని 9మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. ఆధార్ హక్కుతో వ్యక్తిగత హక్కును ఉల్లంఘిస్తున్నారంటూ…
2015లో సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఆధార్ పై విచారణ జరిపేందుకు ఏర్పాటయిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందుగా… వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా… కాదా అన్నదానిపై చర్చ జరగాలని తేల్చింది. ఇందుకోసం తొమ్మిది మంది న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్టు జులై 18న సుప్రీంకోర్టు ప్రకటించింది. వ్యక్తిగత గోప్యతపై విచారణ చేపట్టిన విస్తృత ధర్మాసనం ఆర్టికల్ 21 ప్రకారం ఇది ప్రాథమిక హక్కే అని తేల్చింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను కొట్టేసింది.
కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు అరవింద్ దాతర్, శ్యామ్ దివాన్, గోపాల్ సుబ్రహ్మణ్యం, ఆనంద్ గ్రోవర్ తమ వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. సుప్రీం తీర్పుతో పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, కు ఆధార్ అనుసంధించాలన్న కేంద్రం నిర్ణయానికి ప్రతిబంధకం ఏర్పడింది. బ్యాంకు అకౌంట్ , పాన్ కార్డు వంటి వాటికి ఆధార్ అనుసంధానిస్తే… వ్యక్తిగత గోప్యత ఉండదని, వారి సమాచారాన్ని ఎవరైనా తెలుసుకోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అయితే వ్యక్తిగత గోప్యత అనేది సంపూర్ణమైన స్వేచ్ఛ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఆధార్ బిల్లు ఆమోదం సమయంలో పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన వివరణను సుప్రీంకోర్టు కూడా అంగీకరించిందని, రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. వ్యక్తిగత గోప్యతకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని, డేటా ప్రొటెక్షన్ కోసం నిపుణలతో కమిటీ ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. ఆధార్ లాంటి ఓ సాంకేతిక అద్భుతాన్ని ప్రపంచం మొత్తం కొనియాడిందని తెలిపారు. అటు సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ప్రశంసలు కురిపించాయి. ఈ తీర్పు ప్రతి భారతీయుడి విజయమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ భావజాల తిరస్కరణకు ఇది నాంది ప్రస్తావన అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ గౌరవానికి ఇదొక కొత్త శకమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొనియాడారు. ఈ తీర్పును సగౌరవంగా స్వాగతిస్తున్నట్టు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ట్వీట్ చేశారు.
మరిన్ని వార్తలు: