ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్‌ల సీజన్ నడుస్తుంది. రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రీడాకారులు ఇలా రకరకాలుగా బయోపిక్‌లు వచ్చాయి, వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. సావిత్రి జీవిత చరిత్ర ‘మహానటి’ చిత్రాన్ని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో పలువురు ఫిల్మ్ మేకర్స్ బయోపిక్‌పై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్కు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు కత్తి కాంతారావు, కొండ మురళి ఇలా పలువురి జీవిత చరిత్రలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అయిన రామానాయుడు జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఆయన తనయుడు సురేష్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే నిర్మాత సురేష్‌బాబు స్పందిస్తూ తన తండ్రి జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆసక్తి తనకు కాని, తన కుటుంబ సభ్యులకు కాని లేదని, ఆయన జీవితాన్ని గురించి సినిమాగా తీసుకు రావాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదు అంటూ సురేష్‌బాబు చెప్పుకొచ్చాడు. ఆయన గురించి అందరికి తెల్సిందే అని, అయితే సినిమాగా తీస్తే పెద్దగా సినిమాటిక్ అంశాలు ఉండవని, అందుకే ఆ ఆలోచన లేదు అంటూ సురేష్‌బాబు పేర్కొన్నాడు.