తెలుగు సినిమా బడ్జెట్ పరిధిని హద్దులు దాటేలా చేసిన చిత్రం ‘బాహుబలి’. అంతకు ముందు వరకు 50 నుండి 70 కోట్లు ఖర్చు చేసిన చిత్రంను రికార్డు స్థాయి బడ్జెట్ చిత్రంగా చెప్పుకునేవాళ్లం. కాని బాహుబలి తర్వాత 150 కోట్లకు మించిన బడ్జెట్‌తో సినిమాలు వస్తున్నా కూడా సాదా సీదాగానే చూస్తూ ఉన్నాం. బాహుబలి తెలుగు సినిమా స్వరూపంను మార్చేసింది. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో పదుల సంఖ్యలో వందల కోట్ల చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం సాహో మరియు సైరాలు వందల కోట్లకు పైబడిన బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ఇంకా పలు చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే దారిలో రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశిప’ చిత్రం తెరకెక్కబోతుంది.
ఇటీవలే సురేష్‌బాబు ఈ సినిమాకు సంబంధించిన చిన్న లీక్ ఇచ్చాడు. తమ బ్యానర్లోనే అతి పెద్ద బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గుణశేఖర్ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తుండగా, ప్రముఖ ఆర్ట్ డిజైనర్ సెట్టింగ్స్ కోసం డ్రాయింగ్స్ వేస్తున్నాడు. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సురేష్‌బాబు ఆసక్తిగా ఉన్నాడు. 180 కోట్లలో అత్యధిక శాతం సెట్టింగ్స్ కోసం వినియోగించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక గ్రాఫిక్స్‌కు కూడా భారీ ఎత్తున ఖర్చు చేయాలని, హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌ను వాడాలని గుణశేఖర్ భావిస్తున్నాడు. మొత్తానికి బాహుబలిలో మాదిరిగా భారీ సెట్టింగ్స్‌తో పాటు విజువల్ వండర్ సీన్స్ ‘హిరణ్యకశిప’లో కనిపించబోతున్నట్లుగా అనిపస్తుంది. ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించి 2020 సంవత్సరంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.