ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. తెలుగు, హిందీ అని తేడా లేకుండా దేశంలో ఉన్న పలు భాషల పరిశ్రమల్లో నటులు, సాంకేతిక నిపుణులు ఆత్మహత్యల గురించి వార్తలు వింటున్నాం. తాజాగా తమిళ చిత్రసీమకు చెందిన సినీ నటి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుతున్న వివరాల మేరకు యువనటి, పలు తమిళ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. ‘వంశం’ వంటి సూపర్ హిట్ సీరియల్ అలాగే మరెన్నో చిత్రాల్లో టించిన ఆమె, ఈ ఉదయం వలసరవాక్కంలోని తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించింది.
ఈ ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గత కొంతకాలంగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోందని, కుటుంబ విభేదాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమె కాల్ లిస్టు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. అది బయటకు వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయంలో మరింత సమాచారం తెలియాల్సివుంది.