Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు రాజకీయం ఢిల్లీకి మారింది. అన్నాడీఎంకె చీలిక వర్గాల ఐక్యం దిశగా సాగుతున్న ప్రయత్నాలు ఢిల్లీకి చేరాయి. ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢి్ల్లీ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు బీజేపీ నేతలను ఇ.పి.ఎస్, ఓ.పి.ఎస్ కలవనున్నారు. అటు పార్టీ ఉప ప్రధానకార్యదర్శి పదవి నుంచి దినకరన్ ను తొలగించటంతో పాటు శశికళ వర్గానికి చెక్ పెట్టాలని పన్నీర్ సెల్వం విధించిన షరతుకు పళనిస్వామి వర్గం సానుకూలంగా స్పందిస్తోంది.
ముంత్రులు, ఎమ్మెల్యేలతో గురువారం సమావేశమైన పళనిస్వామి చిన్నమ్మకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్నాడీఎంకె చీలికవర్గాలు కలిసిపోవటానికి అన్ని మార్గాలు సుగమమయ్యాయని పలువురు భావిస్తున్నారు. ఇరువర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఈపీఎస్, ఓపిఎస్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నీర్ సెల్వం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ చేపట్టబోయే పదవులపై అనేక రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన తమిళనాడు ఉపముఖ్యమంత్రి పదవి చేపడతారని ఓ వర్గం అంటుండగా…ఈపీఎస్, ఓపీఎస్ కలిసిపోతే…అన్నాడీఎంకే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి పన్నీర్ సెల్వం కేంద్ర మంత్రి పదవి అవుతారని వార్తలొస్తున్నాయి.
మరోవైపు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఈ వారంలోనే చెన్నయిలో భేటీ కానున్నట్టు సమాచారం. రెండు వర్గాలు కలిసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృష్టిచేయాలని ఈపీఎస్, ఓపీఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జయలలిత మరణం తరువాత పార్టీలో చీలికతో తమిళనాడులో బలహీనపడిన అన్నాడీఎంకె ఇప్పుడిక పాత వైభవం సాధిస్తుందేమో చూడాలి. అటు దక్షిణాదిరాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అన్నాడీఎంకెను కలుపుకుపోవటం ద్వారా తమిళనాడులో ఎన్డీయే మార్కు ఉండేలా పావులుకదుపుతోంది.
మరిన్ని వార్తలు: