Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకుండా లోక్ సభ రేపటికి వాయిదావేయడంపై టీడీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము ఇచ్చిన అవిశ్వాస నోటీసును స్పీకర్ రద్దుచేశారని ఎంపీ తోట నర్సింహులు మండిపడ్డారు. సభ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నట్టు కనపడలేదని, రాజకీయ ఎత్తుగడలతోనే ఇలా చేశారని, కేంద్రప్రభుత్వం తలచుకుంటే ఆందోళన చేసే ఎంపీలను విరమింపచేయలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో చర్చ చేపట్టాలని ఎంపీ అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అవిశ్వాసతీర్మానంపై భయం ఉన్నందువల్లే కేంద్రం చర్చ జరగకుండా చూస్తోందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంపై తాము ప్రతిరోజూ ఇలాగే తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. టీడీపీ అవిశ్వాసతీర్మానానికి 100 మందికి పైగా ఎంపీలు మద్దతుగా నిలబడ్డారని, మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అవిశ్వాసనోటీసుపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటున్న కేంద్ర సర్కార్ ఆందోళన చేస్తోన్న ఎంపీలకు నచ్చచెప్పలేదా అని ప్రశ్నించారు. తమకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని తెలిపారు. అవిశ్వాసతీర్మానంపై చర్చకు సహకరించాలని టీఆర్ ఎస్, అన్నాడీఎంకెను కోరారు. రేపు ఇటువంటి పరిస్థితులు టీఆర్ ఎస్ కు కూడా రాకపోవని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. తాము ఎవ్వరికీ భయపడబోమని, అంతిమ విజయం సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.