Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ ప్రయోజనాల కోసం విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తే..రాజకీయ లబ్దికోసం ఇప్పుడు బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. హామీలు అమలు చేయమంటే ఎదురుదాడికి దిగడం అతిహేయమని, తాము చెప్పిందే వినాలన్న అహంకార ధోరణి కేంద్రప్రభుత్వంలో కనిపిస్తోందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ ఆత్మగౌరవంతో పెట్టిన పార్టీ అని ప్రధాని అంటారని, ఆర్థికమంత్రేమో అవహేళన చేస్తారని, ఒడిశా,మలయాళ ఆత్మగౌరవాలు అడ్డొస్తాయంటారని, దేశ రక్షణ, సైన్యం నిధులతో ఏపీ నిధులు పోలుస్తారని, దీన్నెలా అర్థంచేసుకోవాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చకు అన్నిపార్టీలు సహకరించాలని చంద్రబాబు కోరారు. వెల్ లోకి వెళ్లకుండా అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు సహకరించాలని, అవిశ్వాసంపై జరిగే చర్చల్లో భాగంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులపై ఎంపీలు చేసే ప్రసంగాలు పార్లమెంట్ లో ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు.
అవిశ్వాస అంశం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినది కాబట్టి రాష్ట్ర ఎంపీలకే చర్చలో అధిక ప్రాధాన్యం ఉంటుందని, దీనిని టీడీపీ ఎంపీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రం ప్రస్తుతం కీలకమైన కూడలిలో ఉందని, ఈ పరిస్థితుల్లో అందరి మద్దతు కావాలని, అందుకే అఖిలపక్షాల సమావేశం ఏర్పాటుచేసి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా తప్పులు చేయలేదని, కేంద్రానికి అనేక అవకాశాలు ఇచ్చామని, ఆర్థిక సంఘం నివేదిక పేరు చెప్పి కేంద్రం రాష్ట్రాన్ని మోసగించిందని చంద్రబాబు ఆరోపించారు. హామీలు నెరవేర్చమని కోరితే టీడీపీపై బురదజల్లుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. మిత్రధర్మం విస్మరించింది బీజేపీనేనని, తెలంగాణలో టీడీపీతో పొత్తులేదని ఏకపక్షంగా చెప్పింది ఆ పార్టీనేఅని గుర్తుచేశారు. బీజేపీలో గతంలో ఇలాంటి పోకడలు లేవని, నూతన నాయకత్వంలో ఆ పార్టీ కొత్త పోకడలకు పోతోందని చంద్రబాబు విమర్శించారు.