Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ గెలవగల రెండు స్థానాలకు సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. సీఎం రమేశ్ ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా…కనకమేడల రవీంద్రకుమార్ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. తొలుత రేసులో సీఎం రమేశ్ తో పాటు వర్ల రామయ్య పేరు వినిపించినా..చివరకు కనకమేడల రవీంద్రకుమార్ ను అవకాశం వరించింది. సీఎం రమేశ్ ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కడపకు చెందినవారు కావడంతో పాటు మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి రెండేళ్లక్రితం రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్టుగానే..సీఎం రమేశ్ కు కూడా మరోసారి అవకాశమివ్వాలని చంద్రబాబు భావించడంతో తొలినుంచీ ఆయన పేరు రేసులో వినిపించింది. అనుకున్నట్టుగానే చంద్రబాబు ఆయన్ను ఎంపిక చేశారు. అయితే వర్ల రామయ్యకు మాత్రం నిరాశ ఎదురయింది. చివరి నిమిషంలో ఆయన ఆశలు గల్లంతయి రవీంద్రకుమార్ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై వర్ల రామయ్య స్పందించారు. పార్టీ నిర్ణయం బాధ కలిగించినప్పటికీ…అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాన్ని శిరోధార్యంగా భావిస్తానని వర్లరామయ్య మీడియాతో వ్యాఖ్యానించారు. కొందరు నేతలు వ్యవహరించినట్టు తాను పదవుల కోసం పార్టీ మారే రకం కాదని, చంద్రబాబుకు అండగా ఉండాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని చెప్పారు. తనపై అచంచల విశ్వాసంతో రెండోసారి రాజ్యసభకు పంపుతున్న చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేశ్ కు సీఎం రమేశ్ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమలో అభివృద్ధి జరిగిందని సీఎం రమేశ్ చెప్పారు. కడప జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, ఈసారి రాయలసీమలో వైసీపీ గల్లంతవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
రాజ్యసభ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించడంపై కనకమేడల రవీంద్రకుమార్ సంతోషం వ్యక్తంచేశారు. లీగల్ సెల్ ద్వారా పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తించిన చంద్రబాబు తనకు పూర్తిన్యాయం చేశారని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ పటిష్టతకు పాటుపడతానని చెప్పారు. అటు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది. ప్రతి ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమిత ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ఈసారి రెండు సీట్లు ఓసీలకు కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చంద్రబాబు సహజశైలికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.