Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కేంద్రంగా జాతీయ స్థాయిలో రాజకీయాలు వేడెక్కిన ఈ తరుణంలో జనసేన మౌనం ఎన్నో సందేహాలు రగిలిస్తోంది. ఇప్పటి దాకా జనసేన ఎన్నికల్లో నేరుగా తలపడకపోయినప్పటికీ తాజాగా రాజకీయ వాతావరణం సీరియస్ కావడానికి అమరావతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభే ముఖ్య కారణం. ఈ సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తాడు అనుకున్న పవన్ కళ్యాణ్ టీడీపీ మీద ఒక్కసారిగా దాడి చేయడంతో పరిస్థితి మారిపోయింది. జనసేన దాడి నుంచి తేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అనూహ్యంగా కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చి ఇంకాస్త హీట్ పెంచారు. బీజేపీ జాతీయ స్థాయి కుట్రలో వైసీపీ తో పాటు జనసేన కూడా ఓ పావులా ఉపయోగపడుతోందని ప్రచారం మొదలెట్టారు. అందులో నిజం ఉందని సినీ నటుడు శివాజీ కూడా బీజేపీ మెగా ప్లాన్ ఆపరేషన్ ద్రవిడ గురించి వివరించడంతో ఒక్కసారిగా జనసేన డిఫెన్స్ లో పడింది. పైగా లోకేష్ మీద చేసిన ఆరోపణల విషయంలో కూడా పవన్ కప్పదాటు వైఖరితో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి.
నిజానికి ఏ నాయకుడు అయినా పార్టీ శ్రేణులు నిస్తేజంలో ఉంటే తాను ముందుండి వారికి దిశానిర్దేశం చేయాలి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కూడా ఈ ఆవిర్భావ సభ తరువాత పార్టీ కార్యకలాపాలు ఊపు అందుకుంటాయని చెప్పారు. కానీ టీడీపీ నుంచి వచ్చిన కౌంటర్ వ్యూహాన్ని ఎలా తట్టుకోవాలో అర్ధం కాక మౌనంగా ఉండిపోయారు. అన్ని విధాలుగా కీలకమైన ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం వహించడం చూసి ఆ పార్టీ నేతలు ఇంకాస్త అయోమయంలో పడిపోయారు. అయితే నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలో జనసేన మౌనం చూస్తుంటే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ క్రియాశీలకంగా ఉంటుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రజారాజ్యం తరహాలో పవన్ కళ్యాణ్ సైతం జనసేనని పక్కనబెట్టి తిరిగి సినిమాల్లో బిజీ అయిపోతారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. పవన్ మౌనం వీడి ప్రజాబాహుళ్యంలోకి రాకుంటే జనసేన జెండా పీకేస్తారన్న ప్రచారం కూడా మొదలు అవుతుండడనడంలో సందేహం లేదు.