కాంగ్రెస్ చివరి జాబితా విడుదల…ఆర్ కృష్ణయ్యకి టికెట్…!

Telangana Congress Fourth List Released With Six Names

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఫైనల్ లిస్ట్ ఖరారు చేసింది. మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ తాజాగా మరో ఆరుగురితో నాలుగో జాబితా రిలీజ్ చేసింది. అయితే ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్ జాబితాలో చోటు దక్కడం చర్చానీయాంశంగా మారింది. ఎల్బీనగర్ నుంచి పోటీ చేయడానికి తనకు టిక్కెట్ ఇవ్వాలని కృష్ణయ్య అన్ని పార్టీలనూ సంప్రదించారు. కానీ కాంగ్రెస్ చివరికి మిర్యాలగూడ ఇచ్చింది. మడతపేచీ పడిన మిర్యాలగూడ సమస్యను పరిష్కరించుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని కృష్ణయ్యకు కేటాయించిందని గాంధీ భవన్‌ వర్గాలు అంటున్నాయి. సికింద్రాబాద్ స్థానానికి మరో నేత కాసాని జ్ఞానేశ్వర్‌ కు బీఫాం ఇచ్చారు. ఈయన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అటు టీడీపీతోనూ సంప్రదింపులు జరిపారు, ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే అక్కడ పోటీచేయాలనుకున్నారు. చివరికి కాంగ్రెస్సే టిక్కెట్ ఇచ్చింది. నారాయణపేట్‌ నుంచి వామనగారి కృష్ణ , నారాయణఖేడ్‌ – సురేష్‌ కుమార్‌ షెట్కర్‌ , కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగ్‌రావు, దేవరకద్ర నుంచి డాక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి , వరంగల్ తూర్పు నుంచి గాయత్రి రవికి టిక్కెట్లు ప్రకటించారు. తను పోటీ చేయాలనుకున్న 95 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ప్రకటించినట్లయింది. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొంటామన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. టికెట్ల కేటాయింపులో ఆలస్యం చేసింది. అయితే టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికే ఈ ఆలస్యమనేది ఆ పార్టీకి చెందిన కొందరు నేతల వాదన.

r.krishnaiah

ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్.కృష్ణయ్య. ఈక్రమంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు కనిపించింది. అప్పట్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటానని ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో పార్టీలో జాయిన్ కాలేదు. ఎన్నికల నేపథ్యంలో తాజాగా హస్తం గూటికి చేరారు. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ తుది జాబితాలో చోటు దక్కే ఆ ఆరుగురు ఎవరనేది ఉత్కంఠ రేపింది. సోమవారం నాటితో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ఆదివారం సాయంత్రమైనా.. కాంగ్రెస్ పెద్దలు పేర్లు ప్రకటించకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. తీరా ఆదివారం రాత్రి ఆ ఆరుగురి పేర్లతో లిస్ట్ ఫైనల్ చేశారు. కానీ మిర్యాలగూడ స్థానానికి అనూహ్యంగా ఆర్.కృష్ణయ్యను డిక్లేర్ చేయడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయన గతంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోనంటూ వ్యాఖ్యానించారు. కొన్ని రాజకీయ సమీకరణాలతోనే ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కిందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలయ్యాక ఆర్. కృష్ణయ్య నిరసన గళం వినిపించారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపించారు.

Congress That Gave Shock To The TDP Candidate

అంతేకాదు ఈనెల 17న స్టేట్ బంద్ కు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కడం చర్చానీయాంశంగా మారింది. బీసీ పొలిటికల్ కోటాపై కాంగ్రెస్ ను తూర్పార బట్టడంతోనే టికెటిచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీసీల ఓట్ల శాతం గణనీయంగా ఉండటం.. కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించడం ఇదంతా కూడా పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించిందనే అపవాదు పొగొట్టుకోవడంతో పాటు మిర్యాలగూడ స్థానంలో పొత్తుల సమస్యకు చెక్ పెట్టడానికే కృష్ణయ్యకు అక్కడ టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. అదలావుంటే మిర్యాలగూడ స్థానంలో పోటీ చేసేందుకు టీజేఎస్ పార్టీ కూడా తమ అభ్యర్థి విద్యాధర్ రెడ్డికి బీఫామ్ ఇవ్వడం కొసమెరుపు. మరో వైపు కోరుట్ల టికెట్ కోసం మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నర్సింగరావ్ తో పాటు కొమిరెడ్డి రాములు తీవ్రంగా పోటీపడ్డారు. తనకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్న కొమిరెడ్డి రాములు ప్రచార వాహనాలు కూడా సిద్దం చేసుకున్నట్లు సమాచారం. చివరకు జువ్వాడి నర్సింరావు పేరును ఖరారు చేసింది అధిష్టానం.

Mahakutami Finalises On Deepavali