ఒక్క ఎన్నిక అయినా జరక్కముందే ఆ ముచ్చటా తీరిపోయింది. పవన్ , పవన్ అని పనిగట్టుకు తిరిగి ఆయన నీడలో రాజకీయ అస్తిత్వం నిలబెట్టుకోడానికి తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర జెండా చేసిన ప్రయత్నం వికటించింది. ప్రధాని మోడీ కనుసన్నల్లో పవన్ పని చేస్తున్నాడన్న విమర్శలని పక్కనబెట్టి ఆయనతో రాజకీయ ప్రయాణం కోసం సిపిఎం , సిపిఐ వెంపర్లాడాయి. పవన్ చెప్పకముందే ఆంధ్రాలో జనసేన, సిపిఐ , సిపిఎం,లోక్ సత్తా లతో రాజకీయ కూటమి ఏర్పాటు అవుతుందని ఘనంగా ప్రకటించారు కమ్యూనిస్ట్ నేతలు. అయితే ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా వచ్చిపడ్డాయో అప్పుడే ఎర్ర పార్టీ నేతలకు కనువిప్పు అయ్యింది. ఎన్నికలకు అన్ని పార్టీల లాగానే సంప్రదింపులు , వ్యూహాల కోసం చర్చలు జరుపుదాం అని వామపక్ష నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ అడగడం …ఆయన ఏదో వంక చెప్పి తప్పించుకోవడం చాలా సార్లు జరిగిందట.
దీంతో ముందుగా తేరుకున్న సిపిఐ నాయకులు తెలంగాణాలో కాంగ్రెస్ , టీడీపీ లతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్ళడానికి రెడీ అయిపోయింది. ఈ పాటికే ఆ పార్టీ నేతలతో చర్చలు సాగిస్తోంది.
ఇక సిపిఎం మాత్రం పవన్ కళ్యాణ్ పిలుపు కోసం ఇంకాస్త ఎక్కువగా ఎదురు చూసింది. అయినా ఫలితం లేకపోవడంతో సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తన అసహనాన్ని బయటపెట్టారు. నాలుగు రోజులుగా పవన్ కి ఆరోగ్యం బాగాలేదని ఆయన ప్రతినిధులు చెప్పడం తో ఇక వేచి చూడడంలో అర్ధం లేదన్న ధోరణిలో వీరభద్రం మాట్లాడారు. పవన్ కాకపోతే కలిసి వచ్చే పార్టీలతో మాట్లాడి అభ్యర్థుల ప్రకటన చేయడానికి రెడీ అని చెప్పేసారు. దీంతో పవన్ కళ్యాణ్ రాజకీయంలో సీరియస్ నెస్ ఏంటో ఎర్ర పార్టీ నేతలకు బాగా తెలిసొచ్చింది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ఉండొచ్చని తెలుస్తోంది. అదే జరిగితే కమ్యూనిస్టులు తిరిగి టీడీపీ చెంతకు చేరే అవకాశాల్ని కొట్టిపారేయలేం.