ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా కత్తిపోటుకు గురయిన సంగతి తెలిసిందే. ఒకేఏడాదిగా (శక్రవారం కోర్టు వాయిదా, కొన్ని పబ్లిక్ హాలిడేస్ మినహాయించి) మిగతా ఏ రోజూ సెలవు తీసుకోకుండా జగన్ పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. మండు టెండల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ జగన్ పాదయాత్ర ఆగలేదు. అయితే, విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో దాడి అనంతరం రాజకీయం ఆయన చుట్టూనే తిరుగుతోంది. ఆయనకు ప్రాణ హాని ఉందని ఢిల్లీ వరకు వెళ్లి మరీ వినతి పత్రాలు ఇవ్వడంతో తెలంగాణ – ఏపీ ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం వైఎస్ జగన్‌కు ప్రత్యేక భద్రత కల్పించింది. బుల్లెట్ ప్రూప్ వెహికల్‌ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. అంతేగాకుండా ఆయన ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే ఆయన హైదరాబాద్ లో ప్రయాణిస్తుంటే, ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. జగన్ కాన్వాయ్ వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఈ రూట్ క్లియరెన్స్ సహకరించనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో వీవీఐపీలు పర్యటనలకు వచ్చినప్పుడు, గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు, నాయిని తదితర ప్రముఖులకు మాత్రమే ఈ రూట్ క్లియరెన్స్ అమలవుతుండగా, ఈ జాబితాలో జగన్ కూడా చేరారు. అయితే, జగన్ కాన్వాయ్ కోసం ఏ విధమైన కొత్త ఆంక్షలనూ విధించబోమని, ఆయన ప్రయాణించే రూట్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రమే చూస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. జగన్ కాన్వాయ్ లోని భద్రతను కూడా పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. అయితే దాడి అనంతరం వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతిలో ఉన్నారు. త్వరలో పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలున్నాయి. అంతవరకు హైదరాబాదులో ఉంటున్న నేపథ్యంలో ప్రభత్వం ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. ఇక ఏపీలో జగన్ ప్రతిపక్ష నేత. అందుకే అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. త్వరలోనే జగన్ పాదయాత్ర మళ్లీ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి జగన్ పాదయాత్రలో రెండంచెల భద్రత ఏర్పాటుచేస్తారు. ఇంతకుమునుపులా ఎవరు పడితే వారు జగన్‌తో సెల్ఫీ దిగే అవకాశం ఉండకపోవచ్చు. అధికారులు ఏర్పాటుచేసిన రెండంచెల భద్రతలోకి జగన్‌తో పాటు పోలీసులు అనుమతి అవసరం కావచ్చంటున్నారు.