Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లానే…కర్నాటకలోని తెలుగువారూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరికి కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఎదురయిన అనుభవం చూస్తే…ఆ ప్రచారం నిజమేననిపిస్తోంది. ఎన్నికలకు ఇంకొన్ని రోజులే గడువుఉండడంతో కర్నాటకలో ప్రధానపార్టీలు ప్రచార జోరు పెంచాయి. తెలుగు ప్రజలు అధికంగా నియోజకవర్గాల్లో బీజేపీ ఏపీ నేతలను ప్రచారంలోకి దించింది. ఇందులో భాగంగా దగ్గుబాటి పురంధరేశ్వరి రాయచూర్ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తుండగా…ఓ తెలుగు రైతు..ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మా..పోయిన ఎన్నికల్లో కూడా నువ్వు ఇక్కడకు వచ్చి ప్రచారం చేశావ్..అప్పుడు కాంగ్రెస్ కు ఓటేయమన్నావ్..ఇప్పుడు వచ్చి బీజేపీకి ఓటేయమంటున్నావ్..ఏపీకి అన్యాయం చేసిన పార్టీలతోనే ఎప్పుడూ ఎందుకు ఉంటున్నావమ్మా….అంటూ ఆ రైతు పురంధరేశ్వరిని నిలదీశారు. ఈ మాటకు ఆమె షాక్ తిన్నారు. సమాధానం చెప్పేంతలోపే మళ్లీ ఆ రైతు మీ స్థానంలో వేరొకరుంటే అడిగేవాణ్ని కాదమ్మా…మాది గుడివాడ తాలూకా..మీ నాన్నగారు టీడీపీ స్థాపించినప్పుడు పార్టీ జెండా మోశా. ఆ అభిమానంతోనే అడుగుతున్నా…అన్నారు. దీనిపై స్పందించిన పురంధరేశ్వరి రాష్ట్రాలను బట్టే పరిస్థితులు మారతాయని, న్యాయంచేసే పార్టీలకే ఓటు వేయమని చెబుతున్నానని, తనది రాజకీయం కాదని చెప్పి…అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ ఒక్క సందర్భంలోనే కాదు…ప్రచారంలో అనేక చోట్ల పురందరేశ్వరికి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయినట్టు సమాచారం. మొత్తానికి ఈ ఘటనలు గమనిస్తే..ఏపీకి అన్యాంచేసిన బీజేపీకి కర్నాటకంలో బుద్ధి చెప్పడానికి తెలుగువారు సిద్ధంగా ఉన్నట్టు అర్దమవుతోంది.