బాబోయ్.. ఏముంది అసలు… భారతదేశ చలనచిత్రాల్లోకి మరో పెద్ద సినిమా వచ్చి చేరబోతుంది. ఆ పోరాట సన్నివేశాలు, ఆ హంగామా, ఆ సెట్టింగులు, ఆ భారీ నిర్మాణాలు, ఒక్కోటి చూస్తుంటే ఎప్పుడు సినిమా వచ్చేస్తుందా అన్నట్టు ఉంది. అయితే, ఈ నవంబర్ 8కి సినిమా వస్తుందని లోగో రిలీజ్ చేసిన రోజే చెప్పేశారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ద్వయం అంటే అంచనాలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఇద్దరూ కూడా భిన్న చిత్రాలు చేయడం సిద్ధ హస్తులు కాగా ఇప్పుడు ఆ ఇద్దరు కలిసే ఈ స్టొరీని సినిమా గా మన ముందుకి తీసుకు వస్తున్నారు. అలాగే, ఇండియా లో పేరున్న పెద్ద నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్ళడంలో దోహదపడుతున్నాయ్. ఇంకా, కత్రిన కైఫ్, అలాగే దంగల్ సినిమా లో అమీర్ కి కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ ఈ సినిమాలో ముఖ్యమయిన పాత్రలోనే నటిస్తుంది. తన పాత్ర నిడివి కూడా ఎక్కువే ఉన్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇక, ధూమ్ సిరీస్, రావణ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాకి దర్శకుడు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఒక్కో ఫ్రేమ్ చాలా కళాత్మకంగా, చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఈ సినిమా కథకి ఫిలిప్ మెడోస్ టేలర్ అనే రచయిత రాసిన “కన్ఫ్యూషన్స్ ఆఫ్ థగ్” అనే నవల ఆధారం. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం నెలకొన్న 19వ శతాబ్దంలో ఆజాద్ అని పిలవబడే ఒక దొంగల నాయకుడు బ్రిటిష్ వారికి సవాలుగా మారతాడు. అప్పటి ఆ కథే ఇప్పుడు కొన్ని కాల్పనిక అంశాలతో మన ముందుకి రాబోతుంది. ఆ పెద్ద పెద్ద ఓడలు, యుద్ధాలు, వారి ఆకారాలు, అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అదే విధంగా చూసే వాళ్ళని, మళ్ళీ ఒకసారి చూసేలా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమా తెలుగు, తమిళ్ లో కూడా రాబోతుంది. దానికి గాను, అమితాబ్ మరియు అమీర్ లు తెలుగులోనూ, తమిళ్ లోను మాట్లాడిన వీడియోలను విడుదల చేశారు. అమితాబ్, అమీర్ లు అంటే దక్షిణాన చాలా మందికి ఇష్టమే. ఇక ఈ ఇద్దరు వస్తున్నారు, అలాగే ప్రమోషన్స్ తెలుగు, తమిళ్ లో చేస్తున్నారు అంటే అభిమానులు ఇంకా మురిసిపోతుంటారు.
నటీనటులు: అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్
రచయిత-దర్శకుడు: విజయ కృష్ణ ఆచార్య
నిర్మాత: ఆదిత్య చోప్రా
సంగీతం: అజయ్-అతుల్
నేపధ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఎడురి